సమ్మె సక్సెస్
-
కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసించిన కార్మిక, ఉద్యోగ సంఘాలు
-
మూతపడిన వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు
-
స్తంభించిన రవాణా వ్యవస్థ
-
సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
న్యూశాయంపేట : కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సమ్మె విజయవంతమైంది. దేశంలోని పది ప్రధాన కార్మిక సంఘాలు, కేంద్ర ప్రభుత్వ రంగంలోని సుమారు 20 ఉద్యోగ సంఘాల ఫెడరేషన్‌లు, ఉద్యోగ సంఘాలు ఐక్యంగా సమ్మెకు దిగాయి. పన్నెండు ప్రధాన డిమాండ్‌లను ప్రభుత్వం ముందుంచి ఈ సమ్మెలో పాల్గొన్నాయి. ఈ సమ్మెలో బీజేపీ అనుబంధ బీఎంఎస్ మినహా సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల అనుబంధ కార్మి సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి.
సమ్మె ప్రభావంతో బ్యాంకులు, వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఆటో కార్మిక సంఘాలు కూడా సమ్మెలో పాల్గొన్నాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. బస్సులు నడవకపోవడంతో ప్రైవేటు వాహనాల వారు ప్రయాణికుల నుంచి అధిక మెత్తంలో డబ్బులు వసూలు చేశారు. బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. సినిమా హాళ్లు మూతపడ్డాయి. కార్మికుల ర్యాలీలు, ధర్నాలో పలు పార్టీల నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రధానంగా.. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి ఇప్పుడున్న ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, అసంఘటిత, వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రతతో పాటు, కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించాలని, ప్రభుత్వరంగ సంస్థల్లో వాటా అమ్మకాలను నిలిపివేయాలని, రక్షణ, బ్యాంకు, ఇన్సూరెన్స్ తదితర రంగాల్లో ఎఫ్‌డీఐలను అనుమతించొద్దని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి.
నిలిచిన బొగ్గు ఉత్పత్తి
సింగరేణి భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1, 2, 5, 6, ఓసీపీ, కేఎల్‌పీ గనుల్లో ఉత్పత్తి పూర్తిగా స్తంభించింది. కేవలం అత్యవసర సర్వీసులలో పనిచేసే కార్మికులు మాత్రమే వి«ధులకు హాజరయ్యారు. ఏరియాలో ఒకరోజు ఉత్పత్తి 12వేల టన్నులు పూర్తిగా నిలిచిపోయి రూ.3 కోట్ల నష్టం వాటిల్లింది.