విద్యార్థే ఉపాధ్యాయుడు!
నాగిరెడ్డిపేట: ప్రభుత్వ పాఠశాలల దుస్థితి మారడం లేదు.. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం.. సిబ్బంది ఇష్టారాజ్యం.. వెరసి పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇందుకు మండలంలోని వెంకంపల్లి ప్రాథమిక పాఠశాల దుస్థితే నిదర్శనం. ఇక్కడ ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేడు. విద్యా వలంటీర్‌తో నెట్టుకొస్తున్నారు. అతడు కూడా శుక్రవారం విధులకు రాలేదు. కాగా, ఒక ఉపాధ్యాయుడు వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్లిపోయాడు. దీంతో ఓ విద్యార్థే ఉపాధ్యాయుడిగా మారాడు. తోటి విద్యార్థులకు ఏదో ఒకటి చెప్పి గంటసేపు నెట్టుకొచ్చాడు. ఎంతకీ టీచర్ రాకపోవడంతో విద్యార్థులు క్లాస్‌లోనే ఆటలు ప్రారంభించారు. అక్షరాలకు బదులు ఆటలతోనే కాలక్షేపం చేశారు. దీనిపై ఎంఈవో వివరణ కోరగా, విద్యా వలంటీర్ సెలవుపై వెళ్లడంతో, తాత్కాలిక ఉపాధ్యాయుడిని పంపించినట్లు చెప్పారు. అతడు వెళ్లాడో లేదో తెలియదని, వివరాలు తెలుసుకొని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.