పుట్టెడు దుఃఖంతో పరీక్షకు హాజరు
నందలూరు: తండ్రి మరణాన్ని తలచుకుంటూ మరోవైపు జీవితానికి సంబంధించిన పరీక్ష ఒకేసారి రావడంతో పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుతూ పదో తరగతి పరీక్ష రాశాడు ఓ విద్యార్థి. వివరాలల్లోకి వెళితే.. మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అరవపల్లె తోటపాళెంకు చెందిన షేక్ అబ్దుల్ రెహమాన్ సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఇతడు నందలూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షలు రాస్తున్నాడు.
విద్యార్థి తండ్రి షేక్ అహమ్మద్ పీర్ (57) అనారోగ్యంతో తిరుపతి స్విమ్స్‌లో చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందాడు. అదే రోజు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. తండ్రి మరణంతో దుఖఃసముద్రంలో మునిగిపోయిన ఆ విద్యార్థిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. పెద్దలు ఆ విద్యార్థిని ఓదార్చి శనివారం సైన్స్ పరీక్షకు హాజరు అయ్యేలా చూశారు. పరీక్ష కేంద్రం తనిఖీ నిమిత్తం వచ్చిన ఆర్‌ఐపీ భానుమూర్తిరాజు విషయం తెలుసుకుని ద్యార్థికి ధైర్యం చెప్పారు. పరీక్ష అనంతరం ఆ విద్యార్థి తండ్రి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లాఅధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అహమ్మద్‌పీర్ మృతదేహానికి నివాళులర్పించి విద్యార్థి అబ్దుల్ రెహమాన్‌ను ఓదార్చి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.