గోదావరిలో పడి విద్యార్థి మృతి
Published Sun, Aug 21 2016 11:31 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
ఆత్రేయపురం :
అదుపుతప్పిన విద్యార్థి ఆదివారం సాయంత్రం గౌతమీ గోదావరిలో పడి మరణించాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఆత్రేయపురం గ్రామ శివారు నరసన్నపేటకు చెందిన అంగాని మణికంఠ(16) స్థానిక మహాత్మాగాంధీ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం అతడు గోదావరి వద్ద బహిర్భూమికి వెళ్లాడు. అదుపుతప్పి కాలు జారడంతో గోదావరిలో పడి గల్లంతయ్యాడు. మత్స్యకారుల సహకారంతో అతడి కోసం గాలించగా, అదే ప్రాంతంలో మణికంఠ మృతదేహం లభ్యమైంది. అతడి తల్లిదండ్రులు అంగాని సత్తిపండు, సత్తెమ్మకు ఇద్దరు కుమార్తెలు కాగా, మణికంఠ ఏకైక కుమారుడు.
స్నానానికి వెళ్లి వృద్ధురాలు..
సీతానగరం : ముగ్గళ్ల ఘాట్ వద్ద గోదావరి నదిలో పడి ఓ వృద్ధురాలు మరణించింది. వివరాల్లోకి వెళితే.. రఘుదేవపురం పంచాయతీ రాపాకకు చెందిన చిలుకోటి మాణిక్యం(మణెమ్మ)(62) ఆదివారం ముగ్గళ్ల ఘాట్ వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లింది. నదీ ప్రవాహం కారణంగా ఆమె నీటిలో మునిగిపోయింది. స్థానికులు గమనించి ఆమెను ఒడ్డుకు చేర్చారు. కొనఊపిరితో ఉన్న మాణిక్యం ఘాట్‌లోనే కొద్దిసేపటికి మరణించింది. ఆమె భర్త సన్యాసిరావు, పెళ్లయిన కుమార్తె దుర్గ, కుమారుడు శ్రీనివాస్ విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. దీనిపై ఎటువంటి సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు.
Advertisement