in rever
-
యువతి ఆత్మహత్యాయత్నం
కాట్రేనికోన : పదో తరగతి సర్టిఫికెట్లు పోయాయన్న మనస్తాపంతో కాట్రేనికోన వంతెనపై నుంచి ఓల్డ్ అయినాపురం డ్రెయి¯Œæలో దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన యువతిని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఎస్సై షేక్ జానీ బాషా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాట్రేనికోన సంత మార్కెట్ ప్రాంతానికి చెందిన గుత్తుల వీరవెంకట సత్యనాగేశ్వరరావు కుమార్తె భవాని పదో తరగతి సర్టిఫికెట్లు పోగొట్టుకుంది. దీంతో మనస్తాపం చెంది సోమవారం ఓల్డ్ అయినాపురం డ్రెయి¯Œæలోకి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అదే సమయంలో బలుసుతిప్పకు చెందిన ఓలేటి నమశ్శివాయ (శివ) తన భార్య లక్ష్మితో కలసి ఆటోలో అమలాపురం వెళుతున్నాడు. కాట్రేనికోన వంతెనపై నుంచి దూకిన భవానిని గమనించిన అతడు మరో ఆలోచన లేకుండా కాలువలోకి దూకాడు. నీట మునుగుతున్న భవానిని వెతికి పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు. భవాని ప్రాణాన్ని కాపాడిన శివను స్థానికులు అభినందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
గోదావరిలో పడి విద్యార్థి మృతి
ఆత్రేయపురం : అదుపుతప్పిన విద్యార్థి ఆదివారం సాయంత్రం గౌతమీ గోదావరిలో పడి మరణించాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఆత్రేయపురం గ్రామ శివారు నరసన్నపేటకు చెందిన అంగాని మణికంఠ(16) స్థానిక మహాత్మాగాంధీ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం అతడు గోదావరి వద్ద బహిర్భూమికి వెళ్లాడు. అదుపుతప్పి కాలు జారడంతో గోదావరిలో పడి గల్లంతయ్యాడు. మత్స్యకారుల సహకారంతో అతడి కోసం గాలించగా, అదే ప్రాంతంలో మణికంఠ మృతదేహం లభ్యమైంది. అతడి తల్లిదండ్రులు అంగాని సత్తిపండు, సత్తెమ్మకు ఇద్దరు కుమార్తెలు కాగా, మణికంఠ ఏకైక కుమారుడు. స్నానానికి వెళ్లి వృద్ధురాలు.. సీతానగరం : ముగ్గళ్ల ఘాట్ వద్ద గోదావరి నదిలో పడి ఓ వృద్ధురాలు మరణించింది. వివరాల్లోకి వెళితే.. రఘుదేవపురం పంచాయతీ రాపాకకు చెందిన చిలుకోటి మాణిక్యం(మణెమ్మ)(62) ఆదివారం ముగ్గళ్ల ఘాట్ వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లింది. నదీ ప్రవాహం కారణంగా ఆమె నీటిలో మునిగిపోయింది. స్థానికులు గమనించి ఆమెను ఒడ్డుకు చేర్చారు. కొనఊపిరితో ఉన్న మాణిక్యం ఘాట్‌లోనే కొద్దిసేపటికి మరణించింది. ఆమె భర్త సన్యాసిరావు, పెళ్లయిన కుమార్తె దుర్గ, కుమారుడు శ్రీనివాస్ విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. దీనిపై ఎటువంటి సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు. -
గోదావరిలో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యం
రాజమహేంద్రవరం క్రైం : గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. రాజమహేంద్రవరం రూరల్ దివాన్ చెరువు గ్రామానికి చెందిన యందం వెంకట గణేష్ (16), విజయనగరం జిల్లా సాలూరు గ్రామానికి చెందిన, దివాన్ చెరువులోని గైట్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న సిగడపు చైతన్య (19), రాజమహేంద్రవరం రూరల్ శ్రీరామపురం గ్రామానికి చెందిన నిరుకుందల శంకర్, దివాన్ చెరువుకు చెందిన షేక్ గాంధీ, రాజానగరానికి చెందిన చిటికిన సతీష్ కుమార్‌లు స్నేహితులు. వారు గురువారం మధాహ్నం పుష్కరఘాట్‌లో స్నానం చేసేందుకు దిగారు. యందం వెంకట గణేష్, సిగడపు చైతన్య స్నేహితులు చూస్తుండగానే గోదావరిలో కొట్టుకుపోయారు. మిత్రులు ఇచ్చిన సమాచారంతో త్రీటౌన్ సీఐ శ్రీ రామ కోటేశ్వరరావు హుటాహుటిన రంగంలోకి దిగి గజ ఈతగాళ్ళను, జాలర్లతో మృతదేహాల కోసం గాలించారు. చివరకు శుక్రవారం ఇద్దరి మృతదేహాలు నది నుంచి బయటకు తీసి పోస్టు మార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. బాధితులకు న్యాయం చేయాలని ఆందోళన మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరుతూ విద్యార్థి సంఘం నాయకులు. ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. పుష్కర ఘాట్ వద్ద గల రోడ్డు పై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు లద్దిక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆసరాగా ఉంటారనుకుంటే..
పుష్కర ఘాట్‌లో ఇద్దరి గల్లంతు శోకసంద్రంలో కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం: ఆసరాగా ఉంటారనుకుంటే అందనంత దూరాలకు వెళ్లిపోయారని మృతుల కుటుంబ సభ్యులు విలపించారు. రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లో స్నేహితులతో స్నానానికి వెళ్లిన విజయనగరం జిల్లా సాలూరు గ్రామానికి చెందిన సిగడపు చైతన్య కుమార్ (19) రాజమండ్రికి చెందిన యందం వెంకట గణేష్(16) గల్లంతయ్యారు. చైతన్య కుమార్ తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. ఆసరాగా ఉంటాడనుకుంటే ఇలా అయిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. తన అవసరాల కోసం ఓ హోటల్లో పని చేస్తూ చదువుకుంటున్నాడని, తన బిడ్డ బీటెక్ చదువుతున్నాడని తెలిపారు. మరో మృతుడు యందం వెంకట గణేష్‌కు తల్లి, తండ్రి కూడా గతంలోనే మృతి చెందారు. దివాన్ చెరువులోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. జాలర్లన గజ ఈత గాళ్ళను రప్పించి పోలీసులు గాలిస్తున్నారు. రాత్రి 11 గంటల వరకూ మృత దేహాలు లభ్యం కాలేదు. రక్షణ కరువంటూ రాస్తారోకో... పుష్కర ఘాట్‌లో స్నానం చేసేందుకు వచ్చే భక్తులకు రక్షణ కరువైందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా నాయకులు వైరాల అప్పారావు ఆరోపించారు. ఘాట్‌లో స్నానం చేసేందుకు వచ్చే భక్తులు మృత్యువాత పడుతున్నారని ఘాట్‌లో రెయిలింగ్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్య వైఖరి అవలంభించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. మృతి చెందిన విద్యార్ధుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పుష్కర ఘాట్ వద్దగల రోడ్డు పై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దండోరా నగర అధ్యక్షుడు యందం గోవింద్, తోలేటి రాం ప్రసాద్, గోరింత భాగ్యరాజ్, కుడిల్లి రత్న కిశోర్, వైరాల రమేష్, వైరాల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.