ఆసరాగా ఉంటారనుకుంటే..
-
పుష్కర ఘాట్‌లో ఇద్దరి గల్లంతు
-
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
రాజమహేంద్రవరం: ఆసరాగా ఉంటారనుకుంటే అందనంత దూరాలకు వెళ్లిపోయారని మృతుల కుటుంబ సభ్యులు విలపించారు. రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్లో స్నేహితులతో స్నానానికి వెళ్లిన విజయనగరం జిల్లా సాలూరు గ్రామానికి చెందిన సిగడపు చైతన్య కుమార్ (19) రాజమండ్రికి చెందిన యందం వెంకట గణేష్(16) గల్లంతయ్యారు. చైతన్య కుమార్ తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. ఆసరాగా ఉంటాడనుకుంటే ఇలా అయిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. తన అవసరాల కోసం ఓ హోటల్‌లో పని చేస్తూ చదువుకుంటున్నాడని, తన బిడ్డ బీటెక్ చదువుతున్నాడని తెలిపారు. మరో మృతుడు యందం వెంకట గణేష్‌కు తల్లి, తండ్రి కూడా గతంలోనే మృతి చెందారు. దివాన్ చెరువులోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. జాలర్లన గజ ఈత గాళ్ళను రప్పించి పోలీసులు గాలిస్తున్నారు. రాత్రి 11 గంటల వరకూ మృత దేహాలు లభ్యం కాలేదు.
రక్షణ కరువంటూ రాస్తారోకో...
పుష్కర ఘాట్‌లో స్నానం చేసేందుకు వచ్చే భక్తులకు రక్షణ కరువైందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా నాయకులు వైరాల అప్పారావు ఆరోపించారు. ఘాట్‌లో స్నానం చేసేందుకు వచ్చే భక్తులు మృత్యువాత పడుతున్నారని ఘాట్‌లో రెయిలింగ్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్య వైఖరి అవలంభించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. మృతి చెందిన విద్యార్ధుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పుష్కర ఘాట్ వద్దగల రోడ్డు పై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దండోరా నగర అధ్యక్షుడు యందం గోవింద్, తోలేటి రాం ప్రసాద్, గోరింత భాగ్యరాజ్, కుడిల్లి రత్న కిశోర్, వైరాల రమేష్, వైరాల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.