దుప్పలవలస గురుకులంలో కలకలం!
ఆరో తరగతి విద్యార్థి మృతి
♦ అనారోగ్యంతో ఆస్పత్రిలో మరో విద్యార్థి
♦ అందోళన చెందుతున్న తోటి విద్యార్థులు
♦ విద్యార్థి మృతిపై స్పష్టత కరువు
♦ వెలుగు చూడని కారణాలు
ఎచ్చెర్ల క్యాంపస్:
దుప్పలవలస సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో బుధవారం చోటుచేసుకున్న రెండు సంఘటనలు తీవ్ర కలకలం రేపాయి. ఎచ్చెర్ల మండలం షేర్‌మహ్మద్‌పురం గ్రామానికి చెందిన ఆరో తరగతి (సెక్షన్–బీ)కి చెందిన బలగ గుణశేఖర్ (11) తీవ్ర అస్వస్థతతో మృతి చెందగా, హిరమండలం మండలం పాడలి గ్రామానికి చెందిన ఐదో తరగతి (సెక్షన్–బీ) విద్యార్థి బి.నరేంద్ర తీవ్ర అస్వస్థతతో విశాఖపట్నంలోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడమే ఈ పరిస్థితికి కారణం. ఒకే రోజు ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురి కావటం, ఒక విద్యార్థి మృతి చెందటం గురుకులంలో చర్చనీయాంశమైంది.
∙బలగ గుణశేఖర్ బుధవారం ఉదయం కడుపు నొప్పి ఉన్నట్లు హౌస్ టీచర్‌కు తెలిపాడు. ఈ విద్యార్థికి స్థానికంగా ప్రథమ చికిత్స నిర్వహించినా, ఫలితం లేక పోవటంతో ఉపాధ్యాయుడు బైక్‌పై తీసుకెళ్లి శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం ఎస్.ఎం.పురంలోని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో విద్యార్థి తండ్రి సంజీవి రావు గ్రామస్తులతో కలిసి శ్రీకాకుళం రిమ్స్‌కు చేరుకున్నారు. వైద్యులు చికిత్స నిర్వహించి, గుండె సమస్యగా ఉందని, అత్యవసర శస్త్ర చికిత్స అవసరం కావచ్చుని చెప్పి.. విశాఖపట్నం కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. దీంతో ప్రిన్సిపాల్ బమ్మిడి అప్పన్న, పీడీ కిల్లి ఢిల్లీశ్వరరావుతో కలిసి అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తీసుకెళ్తుండగా నాతవలస సమీపంలో విద్యార్థి చనిపోయాడు.
11 ఏళ్ల విద్యార్థి గుండిపోటుతో మృతి చెందాడా? ఇతర కారణాలు ఏమిటన్నది ప్రస్తు తం చర్చ నీయాంశంగా మారింది. కేజీహెచ్ వైద్యులు విద్యార్థి మృతిని ధ్రువీకరించాక, స్వగ్రామం ఎస్‌ఎంపురం మృత దేహం తీసుకొచ్చి అత్యక్రియలు నిర్వహించారు. కార్పెంటరీ పనిచేస్తూ జీవిస్తున్న సంజీవరావుకు మొదటి సంతానం గుణశేఖర్ కాగా, రెండో సంతానంగా కుమార్తె అఖిల ఉంది. బాలిక అరసవల్లి వసతి గృహంలో ఐదవ తరగతి చదువుతోందిది. అంతంత మాత్రం అర్థిక పరిస్థితి ఉన్న ఈయన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ వసతి గృహాల్లో చదివిస్తూ వస్తున్నారు. గత ఏడాది భార్య శారద అనారోగ్యంతో మృతి చెందింది.
ఇలా వరుసగా కుటుంబాన్ని విషాదం వెంటాడుతుంది. చిన్నప్పటి నుంచి చురుగ్గా చదువులో తన కుమారుడు ఉండేవాడని, ఆరోగ్య సమస్యలు సైతం లేవని, గురుకులానికి ఎంపిక కావడంతో ఎంతో అనందించామని సంజీవరావు చెప్పారు. కొడుకు ఆకస్మిక మృతితో ఆయన రోదించిన తీరు స్థానికులను కలచివేసింది.
∙హిరమండలం మండలం పాడలి గ్రామానికి చెందిన బి.నరేంద్ర దుప్పలవలస సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలోనే ఐదో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం కళ్లు ఎర్రగా ఉన్నాయని హౌస్ టీచర్‌కు చెప్పాడు. స్థానికంగా ప్రాథమిక చికిత్స నిర్వహించినా నయం కాక పోవటంతో శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించారు. ప్రాథమిక చికిత్స నిర్వహించిన వైద్యులు చికిత్సకు విద్యార్థి శరీరం సహక రించక పోవటం, వైరెస్ ఇన్‌ఫెక్షన్ అనుమానంతో కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. అయితే విద్యార్థి బంధువులు జోక్యం చేసుకొని కేజీహెచ్‌కు వద్దని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాలని కోరడంతో విశాఖలోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించారు. అత్యవస వైద్య సేవలు డాక్టర్ల అందిస్తున్నారు. విద్యార్థి కోలుకుంటున్నట్టు గురుకులం ప్రిన్సిపాల్ అప్పన్న చెప్పారు.
∙కాగా రెండు సంఘటనల నేపథ్యంలో తరగతి, సెక్షన్ వారీగా వసతి గృహంలో విద్యార్థులను ఉపాధ్యాయులు ఉంచి పర్యవేక్షిస్తున్నారు. అయితే జరిగిన సంఘటనతో విద్యార్థులు ఆందోళణ చెందుతున్నారు. గుణశేఖర్ మృతిని ఆరో తరగతి విద్యార్థులు జీర్ణించుకోలేక పోతున్నారు.
ప్రిన్సిపాల్ ఏమన్నారంటే..
ప్రిన్సిపాల్ బమ్మిడి అప్పన్న మాట్లాడుతూ పాఠశాలలో ఎటువంటి సమస్య లేదని, తల్లి దండ్రులు అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇద్దరు విద్యార్థులు వారి సమస్యలను హౌస్ టీచర్ల దృష్టికి తీసుకొచ్చిన వెంటనే రిమ్స్‌లో చేర్చించామన్నారు. అయితే వైద్యులు తెలిపిన వివరాల మేరకు గుణశేఖర్ గుండె సంబంధిత వ్యాధితో మృతి చెంది ఉంటాడన్నారు. మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నరేంద్ర కోలుకుంటున్నట్టు చెప్పారు.