కాలువలో పడి విద్యార్థి మృతి
Published Sat, Aug 20 2016 11:28 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
రామకృష్ణాపూర్ : పట్టణంలోని ఆర్‌కేపీ ఓపెన్‌కాస్టు గని సమీపంలో గల నీటి కాలువలో పడి శనివారం కంబాల పవన్‌కల్యాణ్(12) అనే విద్యార్థి మృతిచెందాడు. స్థానిక బీజోన్ ఆర్‌కే4 గడ్డ ప్రాంతానికి చెందిన కూలీ పనిచేసుకునే శ్రీనివాస్–భాగ్య దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడైన పవన్‌కల్యాణ్ శనివారం ఉదయం తన తమ్ముడు వంశీ, పెద్దనాన్న కొడుకు జనార్దన్‌తో కలిసి బహిర్భూమికని ఓపెన్‌కాస్టు కార్యాలయం సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో ఓసీ క్వారీ నుంచి వెళ్లే నీటి కోసం తీసిన కాలువలో ప్రమాదవశాత్తు పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కాలువ ఒడ్డున నడుస్తూ వస్తుండగా మట్టిదిబ్బలు జారడంతో పవన్ కాలువలో పడిపోయాడని వంశీ, జనార్దన్ తెలిపారు. పవన్‌ను కాపాడేందుకు ఓసీ కార్యాలయం వైపు వెళ్లి ఒకరిద్దరిని తీసుకువచ్చామని, కానీ అప్పటికే కాలువలో పూర్తిగా మునిగిపోయి మృతిచెందాడని వారు చెప్పారు. కాగా, స్థానిక సింగరేణి రెస్క్యూ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. పవన్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సోమవారం నుంచి స్కూలుకు వెళ్తానమ్మా అని..
‘అమ్మ ఈ రోజు స్కూలుకి వెళ్లాలనిపించడం లేదు. ఇంటి దగ్గరే ఉంటానమ్మా. సోమవారం నుంచి తప్పకుండా బడికి వెళ్తానమ్మా’ అన్న కొడుకు అంతలోనే అనంత లోకాలకు వెళ్లడంతో ఆ కన్న తల్లి దుఃఖాన్ని దిగమింగుకోలేకపోయింది. శనివారం ఉదయం డబల్ రొట్టె తెచ్చుకుని తిన్న పవన్ అనంతరం బహిర్బూమికని వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటి కాలువ రూపంలో మృత్యువు ఆవహించడంతో అతని కుటుంబం దుఖసాగరంలో మునిగిపోయింది. ఇరుగుపొరుగు వారితో కలివిడిగా ఉండే పవన్ మృత్యువాతపడటం స్థానికులను కలచివేసింది. విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు ఘటనా స్థలికి చేరుకుని కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పరిహారం కోసం ఆందోళన
ఓపెన్‌కాస్టు నీటి కాలువలో పడి మృతిచెందిన పవన్‌కల్యాణ్ కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలంటూ పలు పార్టీల నాయకులతో పాటు ఆర్‌కే4 గడ్డ ప్రాంతవాసులు ఆందోళనకు దిగారు. కాలువకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ఘటన సంభవించిందని ఆగ్రహం వ్యక్తం చే స్తూ కార్యాలయం వద్ద రాత్రి 10 గంటల వరకు ఉన్నారు. వీరి ఆందోⶠన విరమింపచేసేందుకు ప్రయత్నించిన మందమర్రి సీఐ సదయ్యతో స్థానికులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి సాయంత్రమే పోస్టుమార్టం పూర్తిచేసినా రాత్రి 10 గంటల వరకు కూడా మృతదేహం అప్పగించకపోవడమేమిటని మండిపడ్డారు. సింగరేణి యాజమాన్యం పరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement