బైక్ అదుపు తప్పి ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం
–మరొకరి పరిస్థితి విషమం
గూడూరు : స్నేహితుడి బస్సు ఎక్కించేందుకు ఒకే మోటార్ బైక్‌పై నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు అతి వేగంగా వెళ్తు మలుపు వద్ద అదుపు తప్పి ఒకరు మతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన శుక్రవారం మండలంలోని పంబలేరు చప్టా వద్ద జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. ఆదిశంకరా ఇంజనీరింగ్ కళాశాలలో ట్రిపుల్‌ఈ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి హాసిఫ్ గూడూరు నుంచి స్నేహితులైన శివ, క్రాంతితో కలిసి అనికేపల్లికి చెందిన ప్రవీణ్‌ను బస్సు ఎక్కించేందుకు జాతీయ రహదారిపై ఆదిశంకర కూడలి ప్రాంతానికి బయలుదేరారు. వారు అతి వేగంగా మోటార్ బైక్‌పై వస్తుండగా పంబలేరు చప్టా వద్దకు చేరుకునే సరికి మలుపు వద్ద అదుపు తప్పింది. దీంతో ఆ చప్టా వద్ద ఉన్న రాళ్లకు ఢీకొని పడిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రథమ చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన నాయుడుపేట మండలం అన్నమేడుకు చెందిన శివ, హాసిఫ్ పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరుకు తరలిస్తుండగా వారిలో శివ మార్గమధ్యలో మతి చెందాడు. శివ గూడూరులో గదిని అద్దెకు తీసుకుని చదువుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
అతి వేగమే ప్రాణం తీసింది
ఆ నలుగురు విద్యార్థులు విపరీతమైన వేగంగా మోటార్‌సైకిల్‌పై కేకలు వేస్తూ, ఎస్ కటింగ్స్ ఇస్తూ వెళ్లారని, అప్పుడే ఏదైనా ప్రమాదం జరుగుతుందని అనుకున్నామని ప్రత్యక్షంగా చూసిన వారు తెలిపారు. క్షణాల్లోనే అటు వైపు నుంచి వచ్చిన వారు మోటర్‌సైకిల్ బోల్తాపడిందని చెప్పడం.. అంతలోనే ఆటోలో క్షతగాత్రులను తీసుకురావడం చూశామని స్థానికులు చెబుతున్నారు. గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.