విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి
విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి
Published Thu, Aug 11 2016 10:44 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
ఎల్లారెడ్డి : పాఠశాలలో పంద్రాగస్ట్ వేడుకలకు డ్యాన్స్ రిహార్సల్స్‌కు వెళ్లి ఆకలితో ఇంటికి వచ్చి అన్నం తినేందుకు ప్లేట్ తీయబోగా విద్యుత్ షాక్ తగిలి ఓ చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిలోని కళ్యాణి బేస్ ప్రాంతంలో నివాసముంటున్న చెన్నబోయిన రమాదేవి చిన్నకూతురు అఖిల (13) స్థానిక మోడల్ పాఠశాలలో 7వ తరగతి చదువుకుంటున్నది. చదువులో ఆట పాటలలో ఎంతో చురుకుగా ఉండేది. పాఠశాలలో జరగనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నది. పక్కింట్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఆకలితో వచ్చిన చిన్నారి వంటిల్లో వంట పాత్రలు పెట్టేందుకు వాడే స్టీల్ ర్యాక్ నుంచి పళ్లాన్ని తీసుకునేందుకు చేతిని పెట్టగానే విద్యుదాఘాతానికి గురైంది. చిన్నారి అరుపులను విని ఇంటి యజమాని పిట్ల గోవర్ధన్ (45) ఆమెను రక్షించబోగా అతను కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. వంట సామానులు ఉంచే స్టీల్ ర్యాక్ పైన ఉన్న హోల్డర్ నుంచి కరెంట్ వైర్ తెగిపోయి పడటంతో కరెంట్ సరఫరా అయ్యింది. చిన్నారి అక్కడి కక్కడే మృతి చెందగా, అపస్మారక స్థితిలోకి వెళ్లిన గోవర్ధన్‌ను హైద్రాబాద్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అఖిల తండ్రి గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
11 వైఎల్లార్ 104: విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన అఖిల
11 వైఎల్లార్ 106: అఖిల ఫైల్‌ఫోటో
Advertisement