హర్షవర్ధన్
కొత్తవలస రూరల్: తాము కష్టాలు అనుభవించినా పిల్లలు ఉన్నత స్థానాలకు ఎదగాలని కలలు గన్న ఆ తల్లిదండ్రుల ఆశ అడుగంటిపోయింది. ఉన్నత చదువులు చదివి పదిమందికి ఉపయోగపడతానని కన్నకొడుకు అంటుంటే విని మురిసిపోయేవారు. అందొచ్చిన కొడుకు ఆదుకుంటాడని భావిస్తే ఆ బిడ్డకే తలకొరివి పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని తల్లితండ్రులు విలవిల్లాడుతుంటే చూసిన ప్రతి ఒక్కరి హదయం ద్రవించింది. కొత్తవలసకు చెందిన కొండగొర్రి సత్యనారాయణ ఆటోనడుపుతూ తన ఇద్దరు కుమారులు హర్షవర్ధన్(10వ తరగతి), పూర్ణచంద్రరావు(6వతరగతి)లను మండలంలోపి అర్ధానపాలెం ఏపీ మోడల్ స్కూల్లో చదివిస్తున్నాడు. పెద్ద కుమారుడు హర్షవర్ధన్‌కి 10 రోజుల క్రింతం జ్వరం వచ్చింది. మందులు వాడితే తగ్గింది. గురువారం మళ్లీ జ్వరం రావడంతో కొత్తవలస పీహెచ్‌సీకి తీసుకు వెళ్లి డెంగీ లక్షణాలేమైనా ఉన్నాయేమోనని పరీక్షలు కూడా నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం మందులు ఇవ్వడంతో ఇంటికి తీసుకు వచ్చారు. శుక్రవారం సాయంత్రానికి ఉన్నట్లుండి జ్వరం వచ్చి ఆ విద్యార్థి కోమాలోకి వెళ్లిపోవడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఆ విద్యార్థికి ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడంతో శనివారం రాత్రి వరకూ రక్తం ఎక్కించినా ఫలితంలేకపోయిందని వైద్యులు తెలపడంతో ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఆదివారం ఉదయం కొడుకు మతదేహాన్ని తీసుకుని లబోదిబోమంటూ తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు. హర్షవర్ధన్ పార్థివదేహాన్ని చూసేందుకు గ్రామస్తులు, మోడల్ స్కూలు ప్రిన్సిపాల్ పార్వతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్దఎత్తున తరలి వచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు.