ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,కొత్తవలస (శ్రీకాకుళం): ప్రేమించి.. పెద్దలను ఎదిరించి ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. వివాహానంతరం పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఇంతలోనే మద్యానికి బానిసైన భర్త, భార్య డబ్బులివ్వలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫలితంగా ప్రేమించిన పుణ్యానికి ఆమె బిడ్డతో ఒంటరైంది. వివరాల్లోకి వెళ్తే... కొత్తవలస మండలం కొత్తవలస మేజరు పంచాయతీ పరిధి 202 కాలనీకి చెందిన కొటాన ప్రవీణ్(29) ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. పెయింటింగ్ పనులు చేసేవాడు. అదే కాలనీలో నివాసం ఉంటున్న కోట తనూజ(20) సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో ఒకరినొకరు ఇష్టపడ్డారు.
వీరి ప్రేమ విషయం తెలిసిన తనూజ తల్లిదండ్రులు వారించి పెద్దల వద్ద పంచాయతీ నిర్వహించారు. చివరకు కొత్తవలస నుంచి విశాఖపట్నంకు మకాం మార్చారు. అయినా వీరి ప్రేమ వ్యవహారం కొనసాగి చివరకు వివాహం వరకు వెళ్లింది. ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలో తనూజ అత్తవారింటికి దగ్గరైంది. తొలిత ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో ప్రవీణ్ వ్యసనాలు చిచ్చు రేపాయి. తొలి నుంచి పెయింటింగ్ వేస్తూ జీవనానికి అలవాటు పడిన ప్రవీణ్ వివాహం తరువాత కూడా దాన్ని కొనసాగిస్తూ మద్యానికి బానిసయ్యాడు. దీంతో వారి కాపురంలో సమస్యలు ప్రారంభమయ్యాయి.
ప్రవీణ్ తండ్రి చిన్నప్పుడే కుటుంబాన్ని వీడడం, తల్లి పార్వతి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించడంతో ప్రవీణ్ వల్ల ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. తను పెయింటర్ కావడంతో వచ్చిన కొద్దిపాటి ఆదాయానికి మించి వ్యసనాలకు బానిసవడంతో డబ్బుల కోసం తల్లి, భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. డబ్బులివ్వకపోతే చనిపోతానని నిత్యం బెదిరిస్తుండేవాడు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి కూడా ప్రవీణ్ డబ్బుల కోసం తల్లిని బెదిరించాడు. ఎప్పుడూ ఉండే బెదిరింపులేనని వారు సాధారణంగానే తీసుకున్నారు. గొడవ అనంతరం ప్రవీణ్ తల్లి, భార్యాబిడ్డలు నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారి చూసేసరికి ప్రవీణ్ ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలనీలో ఉంటున్న దుంగ మహేష్ దీన్ని తొలిత గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తల్లి పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వైవీ జనార్దన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సామాజిక ఆస్పత్రికి తరలించారు.
ప్రేమను నమ్మి వచ్చినందుకు...
తనూజ ఇంజినీరింగ్ చదివినా ఏడో తరగతి చదివి పెయింటింగ్ పనులు చేస్తున్న ప్రవీణ్‌ను పెద్ద హృదయంతో తన జీవితంలోకి ఆహ్వానించింది. తల్లిదండ్రులను కాదని ప్రవీణ్‌ను ప్రేమించి నమ్మి వచ్చిన తనూజ, బిడ్డను చూసి అంతా కన్నీరుమున్నీరవుతున్నారు. తన జీవితాన్ని ఇలా వదిలేసి ఆత్మహత్యకు పాల్పడిన ప్రవీణ్ మృతదేహాన్ని చూసి తనూజ చేస్తున్న రోదనలు మిన్నంటాయి. ఇక తన జీవితం సాగేదెలా అంటూ బిడ్డను చూసి చేసిన రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి.
Comments
Please login to add a commentAdd a comment