విద్యార్థినిపై హత్యాచారయత్నం
Published Wed, Dec 28 2016 1:09 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
కొత్తవలస: రోజూ స్కూలుకు తీసుకెళ్లే ఆటో డ్రైవర్ విద్యార్థినిపై అఘాయిత్యానికి యత్నించాడు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఎల్.కోట మండలం లక్ష్మింపేట గ్రామానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ సమీపంలోని గ్రామాల విద్యార్థినులను అప్పన్నపాలెం సమీపంలోని జిందాల్ భారతి విద్యా మందిర్‌కు తీసుకెళ్లి, తిరిగి తీసుకు వస్తుంటాడు. మంగళవారం సాయంత్రం కూడా స్కూలు పిల్లలను తీసుకుని బయలుదేరాడు. మార్గమధ్యంలో అందరూ దిగిపోగా కల్లేపల్లికి చెందిన 5వ తరగతి బాలిక మాత్రమే ఉంది. దుర్బుద్ధితో ఉన్న డ్రైవర్ ఆటోను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి యత్నించాడు.
బాలిక తీవ్రంగా ప్రతిఘటించటంతో ఆమెను అక్కడే ఉన్న సిమెంటు దిమ్మెకేసి బలంగా మోదాడు. బాలిక భయంతో గట్టిగా కేకలు వేయడంతో అదే సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అటుగా వెళ్తూ గమనించాడు. దీంతో ఆటో డ్రైవర్ బాలికను వదిలేసి ఆటోతో సహా అక్కడి నుంచి ఉడాయించాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆమె మొహంపై తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Advertisement
Advertisement