విశాఖ లీగల్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఆటోడ్రైవర్‌కు 15 ఏళ్లు జైలుశిక్ష, రూ.50వేలు జరిమానా విధిస్తూ విశాఖ నగరంలోని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనందిని గురువారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా ఏడాదిపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. పోక్సో చట్టం కింద బాలికకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షలు పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి సూచించారు.
ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ అందించిన వివరాల మేరకు... విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రాంజీ ఎస్టేట్‌కు చెందిన పదహారేళ్ల బాలిక 2016లో నగరంలోని రామా టాకీసు వద్ద ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరింది. మరికొందరు బాలికలతో కలిసి ఆమె ప్రతి రోజు ఆటోలో కళాశాలకు వెళ్లేది. ఈ క్రమంలో 2016, సెప్టెంబర్ 29న ఆటో డ్రైవర్ సాయిగణేష్(25) ఆ బాలికను ఒంటరిగా రామాటాకీస్ దగ్గర నుంచి పోర్టు స్టేడియం రోడ్డు మీదుగా అక్కయ్యపాలెం పైపుల సందులోకి తీసుకువెళ్లాడు.
అక్కడ బాలికతో వికృతంగా ప్రవర్తించి లైంగిక దాడి చేశాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తిరిగి ఆటోలో తీసుకువచ్చి ఆమె ఇంటి దగ్గర వదలిపెట్టాడు. ఆటో డ్రైవర్ లైంగికదాడికి పాల్పడిన విషయాన్ని బాధితురాలు తన తల్లికి తెలియజేసింది. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తొలుత ఆమెను సెవెన్ హిల్స్ ఆస్పత్రికి, ఆ తర్వాత కేజీహెచ్‌కి తరలించి చికిత్స చేయించారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు విశాఖ నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేశారు. అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో 15 ఏళ్లు జైలు శిక్ష, రూ.50వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment