Sai Ganesh
-
బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఆటో డ్రైవర్‌కు 15 ఏళ్లు జైలు
విశాఖ లీగల్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఆటోడ్రైవర్‌కు 15 ఏళ్లు జైలుశిక్ష, రూ.50వేలు జరిమానా విధిస్తూ విశాఖ నగరంలోని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనందిని గురువారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా ఏడాదిపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. పోక్సో చట్టం కింద బాలికకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షలు పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి సూచించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ అందించిన వివరాల మేరకు... విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రాంజీ ఎస్టేట్‌కు చెందిన పదహారేళ్ల బాలిక 2016లో నగరంలోని రామా టాకీసు వద్ద ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరింది. మరికొందరు బాలికలతో కలిసి ఆమె ప్రతి రోజు ఆటోలో కళాశాలకు వెళ్లేది. ఈ క్రమంలో 2016, సెప్టెంబర్ 29న ఆటో డ్రైవర్ సాయిగణేష్(25) ఆ బాలికను ఒంటరిగా రామాటాకీస్ దగ్గర నుంచి పోర్టు స్టేడియం రోడ్డు మీదుగా అక్కయ్యపాలెం పైపుల సందులోకి తీసుకువెళ్లాడు. అక్కడ బాలికతో వికృతంగా ప్రవర్తించి లైంగిక దాడి చేశాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తిరిగి ఆటోలో తీసుకువచ్చి ఆమె ఇంటి దగ్గర వదలిపెట్టాడు. ఆటో డ్రైవర్ లైంగికదాడికి పాల్పడిన విషయాన్ని బాధితురాలు తన తల్లికి తెలియజేసింది. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తొలుత ఆమెను సెవెన్ హిల్స్ ఆస్పత్రికి, ఆ తర్వాత కేజీహెచ్‌కి తరలించి చికిత్స చేయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విశాఖ నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేశారు. అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో 15 ఏళ్లు జైలు శిక్ష, రూ.50వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. -
‘టీఆర్ఎస్ మంత్రుల గూండాయిజం’
ఖమ్మం మయూరిసెంటర్: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల గూండాయిజం, అరాచకాలను తట్టుకోలేక ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ఇటీవల ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ కుటుంబాన్ని ఆదివారం ఆయన పరామర్శించారు. సాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సాయిది ఆత్మహత్య కాదని, మంత్రి పువ్వాడ చేసిన హత్య అని ఆరోపించారు. ఆస్పత్రిలో ఉన్న సమయంలో సాయిగణేశ్ నుంచి మరణ వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదని పోలీసులను ప్రశ్నించారు. మంత్రి అజయ్ సూచనతోపాటు సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే స్థానిక పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు. ఇటీవల జరిగిన రామాయంపేట ఆత్మహత్యలు, నిర్మల్, కోదాడల్లో రేప్, వామన్‌రావు దంపతుల హత్య, ఖమ్మంలో సాయిగణేష్ ఆత్మహత్య తదితర ఘటనలన్నీ టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఎంఐఎం నేతలు చేయించినవేనని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ కంట్రోల్లో లేరని అన్నారు. తాము అధికారంలోకి రాగానే మంత్రి పువ్వాడ భూకబ్జాలను తోడుతామని, ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. సాయిగణేశ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు బీజేపీ ముందుకొచ్చింది. సాయి గణేశ్ అమ్మమ్మ సావిత్రమ్మ ప్రస్తుతం అద్దె ఇంట్లో నివాసం ఉంటుండగా, ఆ ప్రాంతంలోనే రూ.15 లక్షలతో ఇల్లు కొనుగోలు చేసి, పట్టా కాగితాలను బండి సంజయ్ చేతుల మీదుగా అందజేశారు. సాయి చెల్లెలు కావేరికి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. సాయి గణేశ్‌తో నిశ్చితార్థం జరిగిన విజయతో సంజయ్ మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని, విజయకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అమిత్ షా రాకతో కార్యకర్తల్లో జోష్ బంజారాహిల్స్(హైదరాబాద్): మొదటివిడత ప్రజా సంగ్రామయాత్రతో ప్రజల్లో స్పష్టత వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతమైన సందర్భంగా ఆదివారం ఆయన జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ అమిత్ షా రాకతో ప్రతి కార్యకర్తలో జోష్ వచ్చిందని, ఆయన సందేశం కొన్ని రాజకీయ పార్టీలకు చెంపపెట్టు లాంటిదని అన్నారు. ఉచిత వైద్యం, విద్య అనే హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. పేదరికంతో ఎంతోమంది గుడిసెల్లో జీవిస్తున్నారని, పేదలందరికీ ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. దర్శనం అనంతరం సంజయ్‌కు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి సతీమణి లక్ష్మిశృతి పెద్దమ్మతల్లి చిత్రపటాన్ని బహూకరించారు. -
సాయిగణేష్‌తో నిశ్చితార్థమైన యువతి ఆత్మహత్యాయత్నం
సాక్షి, ఖమ్మం జిల్లా: ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్‌తో నిశ్చితార్థం జరిగిన యువతి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.. సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి మనస్థాపంతో ఉన్న యువతి విజయ ఇవాళ మధ్యాహ్నం ఖమ్మంలో సాయి గణేష్ నిర్మించాలనుకున్న బీజేపీ పార్టీకి సంబంధించిన దిమ్మె స్థలంలో అపస్మారక స్థితిలో పడిపోవడంతో స్థానికులు వెంటనే గమనించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. చదవండి: తెలంగాణ సీఎస్‌పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వచ్చే నెల 4వ తేదీ సాయి గణేష్, విజయ వివాహం జరగాల్సి ఉంది. ఈ నెల 14వ తేదీ ఖమ్మం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సాయి గణేష్.. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించగా అక్కడ ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయి గణేష్ మృతి చెందాడు. ఆ తర్వాత సాయి గణేష్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.. సాయి గణేష్ మృతికి కారణమైన మంత్రి అజయ్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో కూడా నడుస్తోంది. -
పువ్వాడకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం పట్టణానికి చెందిన బీజేపీ కార్యకర్త ఎస్. సాయి గణేశ్ ఆత్మహత్య ఘటనపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శులతోపాటు ఖమ్మం సీపీ, ఖమ్మం మూడవ పట్టణ ఎస్‌హెచ్‌వో, సీబీఐ డైరెక్టర్, టీఆర్ఎస్ నేత ప్రసన్న క్రిష్ణ, సీఐ సర్వయ్యలకూ నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై 7 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. సాయిగణేశ్ ఆత్మహత్య ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతోపాటు బాధిత కుటుంబానికి పరిహారం ఇచ్చేలా ఆదేశించాలంటూ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన న్యాయవాది కె. క్రిష్ణయ్య (గతంలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ నేత) దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం లంచ్ మోషన్ రూపంలో విచారించింది. సీబీఐ దర్యాప్తుతోనే వాస్తవాలు తెలుస్తాయి: పిటిషనర్ పోలీసుల వేధింపులతోనే సాయిగణేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని పిటిషనర్ తరఫు న్యాయవాది అభినవ్ క్రిష్ణ నివేదించారు. మంత్రి ఆదేశాలతో పోలీసులు సాయిపై 10 కేసులు బనాయించారని, రౌడీషీట్ తెరిచారన్నారు. తన చావుకు మంత్రి కారణమంటూ గణేశ్ మరణ వాంగ్మూలం ఇచ్చినా పువ్వాడపై పోలీసులు కేసు నమోదు చేయలేదని గుర్తుచేశారు. ఈ కేసును స్థానిక పోలీసులు పారదర్శకంగా దర్యాప్తు చేయట్లేదని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఈ ఘటన తర్వాత మృతుడి తల్లికి రూ.50 లక్షలు, కారు ఇస్తామని ప్రలోభపెడుతున్నారన్నారు. ఘటనపై సీఆర్పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. కౌంటర్ దాఖలుకు గడువు కోరడంతో విచారణను కోర్టు వాయిదా వేసింది. -
మంత్రి, పోలీసులు కక్ష గట్టి వేధించారు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘ఖమ్మంలోని కూడలిలో అంబేడ్కర్ విగ్రహం పెట్టేందుకు సాయిగణేశ్ పోరాడినప్పటి నుంచి స్థానిక మంత్రి, పోలీసులు కక్షగట్టారు. కేటీఆర్ పర్యటన ఉండటంతో ముందస్తు అరెస్టు చేశారు. వచ్చే నెల 4న సాయి పెళ్లి ఉండటం, అరెస్టు చేసి జైలులో పెడితే అత్తింటి వారి ఎదుట తలదించుకోవాల్సి వస్తుందని ఆవేదనతో కుమిలిపోయి సాయి ఆత్మహత్యకు పాల్పడ్డారు’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సాయి ఆత్మహత్య పాపం రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఇందుకు మంత్రి పువ్వాడ అజయ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు, దౌర్జన్యాలకు పాల్పడితే సాయి విషం తాగిన చోటే టీఆర్ఎస్ను పాతరేస్తామని హెచ్చరించారు. శుక్రవారం ఖమ్మంలో సాయి అమ్మమ్మ సావిత్రమ్మ, సోదరి కావేరిని కిషన్‌రెడ్డి పరామర్శించారు. రూ.8 లక్షల చెక్కు అందజేశారు. తర్వాత ధర్నాచౌక్‌లో సంతాప సభలో బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అధికారులు లక్ష్మణ రేఖ దాటుతూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. చర్చకు సిద్ధమా కేసీఆర్? ‘రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ సర్కారు ఇచ్చిందెంత? కేంద్రం ఇచ్చింది ఎంతో చర్చకు సిద్ధమా కేసీఆర్’ అని కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీల దాకా అభివృద్ధి పనులకు కేంద్రమే నిధులిస్తోందని, చివరకు ప్రభుత్వం తెచ్చే అప్పుల్లో 90 శాతం కేంద్రమే ఇస్తోందని చెప్పారు. ఎనిమిదేళ్లలో సెక్రటేరియట్‌కు సీఎం ఎన్ని రోజులు వచ్చారో చెప్పాలన్నారు. -
పువ్వాడ సంగతి తేలుస్తాం: బండి సంజయ్
సాక్షి, ఖమ్మం: తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హత్యారాజకీయాలు చేస్తున్నాడంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న బండి సంజయ్.. బీజేపీ కార్యకర్త సాయి గణేష్ సంస్మరణ సభ సందర్భంగా జూమ్ లైవ్ ద్వారా మాట్లాడారు. సాయి గణేష్ ఆత్మహత్య చాలా బాధాకరమన్న ఆయన.. స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ వేధింపుల కారణంగానే గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ‘‘సాయి గణేష్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. అతనిపై 16కేసులు పెట్టీ రౌడీ షీట్ ఒపెన్ చేశారు. బలవన్మరణానికి కారణం అయ్యింది ఈ ప్రభుత్వం. మంత్రి పువ్వాడ అజయ్ చిట్టా అంతా మాకు తెలుసు. పువ్వాడను విడిచిపెట్టేదే లేదు. సంగతి తేలుస్తాం. ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటాం. సాయి గణేష్ ఘటనపై సీఎం కేసీఆర్ సీబీఐ విచారణకు కోరాలి. ఇప్పటికే ఈ వ్యవహారంపై పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు కూడా పంపింది. -
Puvvada Ajay: నాపై కుట్ర జరుగుతోంది: మంత్రి పువ్వాడ
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన సాయి గణేష్ సూసైడ్ ఘటనపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. ఆయన వైరాలో కమ్మ కళ్యాణం మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఖమ్మంలో చిన్న విషయం జరిగితే దానిని అడ్డం పెట్టుకొని తనపై కుట్ర చేస్తున్నారని అన్నారు. కొంత మంది సూడో చౌదరీలు వారితో చేతులు కలిపి తనపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గంలో తనకు మంత్రి పదవి ఇవ్వడం అదృష్టమని తెలిపారు. మంత్రి వర్గంలో నుంచి తనను తొలగించేందుకు తనపై నిందలు మోపి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. అందుకే కమ్మ కులస్థులందరూ రాజకీయాలకతీతంగా ఐక్యతగా ఉద్యమం చేపట్టాలన్నారు. తాజాగా అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సాయి గణేష్ ఘటనలో మంత్రి అజయ్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని బీజేపి, కాంగ్రెస్‌లు పాట్టుపడుతున్న విషయం తెలిసిందే. అజయ్ కుమార్‌ను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సాయి గణేష్ ఆత్మహత్య కేసులో దాఖలైన పిటిషన్ ఆధారంగా.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు తెలంగాణ హైకోర్టు నోటిసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 29 లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. -
సాయిగణేష్ సూసైడ్ కేస్: మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న సాయిగణేష్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై దాఖలైన ఓ పిటిషన్‌పై స్పందించిన తెలంగాణ హైకోర్టు.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. ఈ వ్వవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గడువిచ్చింది ఉన్నత న్యాయస్థానం. మంత్రి పువ్వాడతో పాటు మొత్తం ఎనిమిది మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఆపై విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. పోలీసుల వేధింపుల తాళలేక సాయి గణేష్ ఆత్మహత్య చేసున్నాడని పిటిషనర్ తరపు న్యాయవాది అభినవ్ వాదించారు. ఈ కేసును సీబీఐతో ప్రత్యేక దర్యాప్తు చేయించాలని కోరారు. అయితే.. సాయి గణేష్ ఆత్మహత్య పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్న అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తెలిపారు. కొంత సమయం ఇస్తే పూర్తి వివరాల తో కౌంటర్ ధాఖలు చేస్తామని ఏజీ తెలపగా.. తదుపరి విచారణను ఏప్రిల్ 29 కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. చదవండి: అలాంటి పోలీసులను వదిలిపెట్టం.. బండి సంజయ్ వార్నింగ్ -
కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా... కారణాలు అవేనా?
సాక్షి , ఖమ్మం: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడింట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ కామర్స్‌పైన ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీ సమావేశంతో పాటు, తెలంగాణ ప్రభుత్వ స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఖమ్మం పర్యటనకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో తదుపరి తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. అయితే, కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా వెనుక పై రెండు కారణాలే ఉన్నాయా? లేక బీజేపీ మజ్దూర్ సంఘ్ జిల్లా కన్వీనర్ సాయిగణేష్ మృతితో తలెత్తిన పరిస్థితులు కారణమా? అనేది తెలియదు. సాయిగణేష్ మృతితో బీజేపీ శ్రేణులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ పర్యటన కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లను కొన్నిచోట్ల బీజేపీ కార్యకర్తలు దహనం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీ నినాదాలతో ఖమ్మం పట్టణం అట్టుడికింది. ఈనెల 18న మంత్రి కేటీఆర్ ఖమ్మంలో పర్యటించాల్సి ఉంది. తొలుత ఈనెల 16న కేటీఆర్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. పలు కారణాలతో 18వ తేదీకి వాయిదా పడింది. చదవండి: (20 రోజుల్లో పెళ్లి.. ఇప్పటికే 16 కేసులు.. చార్జిషీట్ కూడా తెరవడంతో) -
20 రోజుల్లో పెళ్లి.. ఇప్పటికే 16 కేసులు.. చార్జిషీట్ కూడా తెరవడంతో
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పోలీసులు తనను కావాలని వేధిస్తున్నారంటూ పురుగుల మందు తాగిన బీజేపీ నేత సామినేని సాయిగణేశ్ (25) మృతిచెంద డం తో.. శనివారం ఖమ్మం జిల్లా కేంద్రం అట్టుడికింది. బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఆందోళనలకు దిగడం, ప్రభుత్వాస్పత్రి అద్దాలు ధ్వంసం చేయడం, మంత్రి పువ్వాడ అజయ్, ఇతర టీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలు, కటౌట్లను దహనం చేయడం, ప్రతిగా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా దాడులకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొందరు బీజేపీ నేతలు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాలను నియంత్రించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. (చదవండి: వేధింపు హత్యలు) కేసులు పెట్టి వేధిస్తున్నారని.. బీజేపీలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ మజ్దూర్ సంఘ్ జిల్లా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న సామినేని సాయిగణేశ్‌పై ఏడాది కాలంలో ఖమ్మం పట్టణంలోని పలు పోలీస్స్టేషన్లలో 16 కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఆయన నివాసం ఉంటున్న 46వ డివిజన్లోని జూబ్లీక్లబ్ వెనుక బీజేపీ జెండా గద్దెను నిర్మించగా.. స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు దాన్ని కూల్చివేశారు. ఇదేమిటని సాయిగణేశ్ నిలదీయడంతో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆయనపై త్రీటౌన్ పోలీసుస్టేషన్లో మరో కేసు నమోదు చేయడంతోపాటు రౌడీషీట్ తెరిచారు. అయితే పోలీసులు తనను తరచూ స్టేషన్‌కు రావాలంటూ వేధిస్తున్నారని, బయట తిరిగితే ఎవరూ కాపాడలేరంటూ భయపెట్టారని చెప్తూ సాయిగణేశ్ ఆందోళనకు గురయ్యాడు. ఈ నెల 14న త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగాడు. పోలీసులు తొలుత ప్రభుత్వాస్పత్రికి, తర్వాత స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని ఖమ్మంకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రి వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు సాయిగణేశ్ మృతదేహం ఆస్పత్రికి చేరుకున్నా.. 3 గంటల వరకు కూడా పోస్టుమార్టం జరగలేదు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు.. పోలీసులు, అధికారపార్టీ నేతల తీరుపై మండిపడుతూ ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. అద్దాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలు, ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. 20రోజుల్లో పెళ్లి ఉండగా.. సాయిగణేశ్ చిన్నతనంలోనే తండ్రి వెంకటేశ్వరరావును కోల్పోయారు. గతేడాది కోవిడ్ సమయంలో తల్లి మంజుల కన్నుమూశారు. ఈ క్రమంలో సాయిగణేశ్‌కు వివాహం కుదిర్చిన బంధువులు.. మే 4న ముహూర్తం ఖరారు చేశారు. వివాహ ఏర్పాట్లలో ఉండగానే అతను తనువు చాలించడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. మంత్రి పువ్వాడ కారణమంటూ.. మరోవైపు సాయిగణేశ్ మృతికి మంత్రి పువ్వాడ అజయ్, కార్పొరేటర్ కన్నం వైష్ణవి భర్త ప్రసన్నకృష్ణ, పోలీసులు కారకులంటూ పట్టణవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళ నకు దిగారు. మంత్రి పువ్వాడ అజయ్, ఇతర నేతల ఫ్లెక్సీలు, కటౌట్లను చించేసి, దహనం చేశారు. ఓ ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీనికి ప్రతిగా టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. దీనితో హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు కార్యకర్తలకూ దెబ్బలు తగిలాయి. పోలీసులు కల్పించుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇక సాయిగణేశ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయి.. అంతిమయాత్ర నిర్వహిస్తుండగా కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ నాయకులపై దాడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లే రోడ్లు, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, కలెక్టరేట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. (చదవండి: కాల్చుకు తిన్నారు! సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలో ఆవేదన) -
బీజేపీ కార్యకర్త మృతి.. ఖమ్మంలో టెన్షన్ టెన్షన్..
సాక్షి, ఖమ్మం: పోలీస్ స్టేషన్లో పురుగుల మందు తాగి అత్మాహత్యాయత్నం చేసిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్ మృతదేహం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. పోస్టుమార్టం పూర్తైన అనంతరం సాయి గణేష్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి భారీగా బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో ఆసుపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు. కాగా వచ్చే నెల 4వ తేదీన సాయి గణేష్ వివాహం జరగనుంది. ఇంతలోనే ఇలా జరగటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే సాయి గణేష్‌పై పోలీసులు కేసులు పెట్టి వేధించారని బంధువులు ఆరోపిస్తున్నారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లోనే పురుగుల మందు తాగానని తమతో సాయి గణేష్ చెప్పాడనీ బంధువులు చెబుతున్నారు. సంబంధిత వార్త: సాయి గణేష్ మృతి.. అలాంటి పోలీసులను వదిలిపెట్టం: బండి సంజయ్ ఖమ్మంలో టెన్షన్ ఖమ్మం పట్టణంలో టెన్షన్ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్త సాయి గణేష్ మృతి నేపథ్యంలో మంత్రి అజయ్ కుమార్ కార్యాలయం, జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల వల్లే పోలీసులు సాయి గణేష్ పై అక్రమ కేసులు పెట్టారని, దీనిలో భాగంగానే తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రి కార్యాలయం నాలుగు వైపులా భారీ గేట్లను ఏర్పాటు చేసిన పోలీసులు ఎవరిని అనుమతించట్లేదు. -
సాయి గణేష్ మృతి.. అలాంటి పోలీసులను వదిలిపెట్టం: బండి సంజయ్
సాక్షి, ఖమ్మం: పోలీసుల వేధింపులతో పురుగుల మందు తాగి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బీజేపీ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు సాయి గణేష్ మృతి తీరని లోటు అని బండి సంజయ్ అన్నారు. పాదయాత్రలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉందని, త్వరలోనే ప్రజలు చరమగీతం పడతారని దుయ్యబట్టారు. సాయి గణేష్ కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా బీజేపీ పార్టీ కార్యచరణ రూపొందించి కార్యకర్తలకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ‘ఖమ్మం లోని స్థానిక మంత్రి చేసిన అవినీతి అడ్డుకొని ధర్మం కోసం నిబద్ధతతో పని చేసిన సాయిని వేధించి అక్రమ కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకుని విధంగా చేశారు. కండ కవరం తలకెక్కి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న మీరు మనుషులు కాదు మానవ మృగాలు. బీజేపీని ఎదుర్కొలేక కార్యకర్తలను పోలీసుల చేత భయపెడుతున్నారు.. అలాంటి కొమ్ము కాసే పోలీసులను వదిలిపెట్టం’ అని హెచ్చరించారు. సాయి గణేష్ మృతి పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని పురుగులు మంది తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్ మృతిచెందారు. గణేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. కాగా బీజేపీ మజ్జూరు సంఘం జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్న సాయి గణేష్ ఖమ్మం జిల్లా కేంద్రంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ రిధిలో బీజేపీ పార్టీ జెండా గద్దె కట్టేందుకు ప్రయత్నించగా దాన్ని కూల్చేశారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ నేతల ఒత్తిడితోపోలీసులు వేధిస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి బయపెడుతున్నారని ఆరోపిస్తూ ఆత్మాహత్యాయత్నం చేశాడు. దీంతో పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆ యువకుడు మరణించాడు. కాగా పోలీస్ స్టేషన్‌కు సంబంధం లేదనీ, బయటనే పురుగుల మందు సేవించాడని పోలీసులు చెబుతున్నారు. అయితే సీసటీవీ ఫుటేజ్ బయట పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కార్యాలయాలన్ని ముట్టడి చేసి మంత్రి అజయ్ కుమార్ రాజీనామా చేసేంతవరకు ఆందోళన చేపడతామంటున్నారు. -
ఆభరణాల దుకాణంలో చోరీ
పాలకొండ, న్యూస్‌లైన్: పాలకొండ పోస్టాఫీస్ ఎదుట ఉన్న శ్రీసాయిగణేష్ జ్యూయలరీలో మంగళవారం తెల్లవారు జామున చోరీ జరిగింది. కొంతమేర బంగారంతో పాటు అరకేజీ వెండి అపహరణకు గురైందని దుకాణం యజమాని పొట్నూరు నాగేశ్వరరావు తెలిపారు. షాపు షట్టర్‌ను విరగ్గొట్టి..తాళాలను పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఘటనా స్థలిని డీఎస్పీ దేవానంద్‌శాంతో, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.హెచ్.విజయానంద్, ఎస్సై ఎం.వినోద్‌బాబు సందర్శిం చారు. దొంగతనంపై ఆరా తీశారు. అయితే రాత్రిపూట గస్తీ తిరుగుతుండగా అనంతరావు అనే హోంగార్డు దృష్టిలో నలుగురు యువకులు పడ్డారని..వారిని వెంబడించినా..తప్పించుకున్నారన్న విషయాన్ని తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. క్లూస్ టీమ్ కూడా సందర్శించి వివరాలు సేకరించింది. కాగా నడిబొడ్డున పోస్టాఫీస్ రోడ్డులో ఆభరణాల దుకాణం చోరీకి గురవ్వడంతో వ్యాపార వర్గాల్లో అలజడి నెలకొంది.