పోలీసు బందోబస్తు నడుమ సాయిగణేష్ అంతిమయాత్ర (ఇన్‌సెట్లో సాయిగణేష్-పాత చిత్రం)
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పోలీసులు తనను కావాలని వేధిస్తున్నారంటూ పురుగుల మందు తాగిన బీజేపీ నేత సామినేని సాయిగణేశ్ (25) మృతిచెంద డం తో.. శనివారం ఖమ్మం జిల్లా కేంద్రం అట్టుడికింది. బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఆందోళనలకు దిగడం, ప్రభుత్వాస్పత్రి అద్దాలు ధ్వంసం చేయడం, మంత్రి పువ్వాడ అజయ్, ఇతర టీఆర్‌ఎస్ నేతల ఫ్లెక్సీలు, కటౌట్లను దహనం చేయడం, ప్రతిగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు కూడా దాడులకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొందరు బీజేపీ నేతలు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాలను నియంత్రించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
(చదవండి: వేధింపు హత్యలు)
కేసులు పెట్టి వేధిస్తున్నారని..
బీజేపీలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ మజ్దూర్ సంఘ్ జిల్లా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న సామినేని సాయిగణేశ్‌పై ఏడాది కాలంలో ఖమ్మం పట్టణంలోని పలు పోలీస్‌స్టేషన్లలో 16 కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఆయన నివాసం ఉంటున్న 46వ డివిజన్‌లోని జూబ్లీక్లబ్ వెనుక బీజేపీ జెండా గద్దెను నిర్మించగా.. స్థానిక టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాన్ని కూల్చివేశారు. ఇదేమిటని సాయిగణేశ్ నిలదీయడంతో గొడవ జరిగింది.
ఈ క్రమంలో ఆయనపై త్రీటౌన్ పోలీసుస్టేషన్‌లో మరో కేసు నమోదు చేయడంతోపాటు రౌడీషీట్ తెరిచారు. అయితే పోలీసులు తనను తరచూ స్టేషన్‌కు రావాలంటూ వేధిస్తున్నారని, బయట తిరిగితే ఎవరూ కాపాడలేరంటూ భయపెట్టారని చెప్తూ సాయిగణేశ్ ఆందోళనకు గురయ్యాడు. ఈ నెల 14న త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగాడు. పోలీసులు తొలుత ప్రభుత్వాస్పత్రికి, తర్వాత స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు.
పోలీసులు మృతదేహాన్ని ఖమ్మంకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రి వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు సాయిగణేశ్ మృతదేహం ఆస్పత్రికి చేరుకున్నా.. 3 గంటల వరకు కూడా పోస్టుమార్టం జరగలేదు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు.. పోలీసులు, అధికారపార్టీ నేతల తీరుపై మండిపడుతూ ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. అద్దాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలు, ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.
20రోజుల్లో పెళ్లి ఉండగా..
సాయిగణేశ్ చిన్నతనంలోనే తండ్రి వెంకటేశ్వరరావును కోల్పోయారు. గతేడాది కోవిడ్ సమయంలో తల్లి మంజుల కన్నుమూశారు. ఈ క్రమంలో సాయిగణేశ్‌కు వివాహం కుదిర్చిన బంధువులు.. మే 4న ముహూర్తం ఖరారు చేశారు. వివాహ ఏర్పాట్లలో ఉండగానే అతను తనువు చాలించడం కుటుంబంలో విషాదాన్ని నింపింది.
మంత్రి పువ్వాడ కారణమంటూ..
మరోవైపు సాయిగణేశ్ మృతికి మంత్రి పువ్వాడ అజయ్, కార్పొరేటర్ కన్నం వైష్ణవి భర్త ప్రసన్నకృష్ణ, పోలీసులు కారకులంటూ పట్టణవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళ నకు దిగారు. మంత్రి పువ్వాడ అజయ్, ఇతర నేతల ఫ్లెక్సీలు, కటౌట్లను చించేసి, దహనం చేశారు. ఓ ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీనికి ప్రతిగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. దీనితో హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.
మరికొందరు కార్యకర్తలకూ దెబ్బలు తగిలాయి. పోలీసులు కల్పించుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇక సాయిగణేశ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయి.. అంతిమయాత్ర నిర్వహిస్తుండగా కొందరు టీఆర్‌ఎస్ కార్యకర్తలు బీజేపీ నాయకులపై దాడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లే రోడ్లు, టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయం, కలెక్టరేట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
(చదవండి: కాల్చుకు తిన్నారు! సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలో ఆవేదన)
Comments
Please login to add a commentAdd a comment