సాయి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కిషన్‌రెడ్డి. చిత్రంలో పొంగులేటి, వివేక్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘ఖమ్మంలోని కూడలిలో అంబేడ్కర్ విగ్రహం పెట్టేందుకు సాయిగణేశ్ పోరాడినప్పటి నుంచి స్థానిక మంత్రి, పోలీసులు కక్షగట్టారు. కేటీఆర్ పర్యటన ఉండటంతో ముందస్తు అరెస్టు చేశారు. వచ్చే నెల 4న సాయి పెళ్లి ఉండటం, అరెస్టు చేసి జైలులో పెడితే అత్తింటి వారి ఎదుట తలదించుకోవాల్సి వస్తుందని ఆవేదనతో కుమిలిపోయి సాయి ఆత్మహత్యకు పాల్పడ్డారు’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సాయి ఆత్మహత్య పాపం రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఇందుకు మంత్రి పువ్వాడ అజయ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు, దౌర్జన్యాలకు పాల్పడితే సాయి విషం తాగిన చోటే టీఆర్‌ఎస్‌ను పాతరేస్తామని హెచ్చరించారు. శుక్రవారం ఖమ్మంలో సాయి అమ్మమ్మ సావిత్రమ్మ, సోదరి కావేరిని కిషన్‌రెడ్డి పరామర్శించారు. రూ.8 లక్షల చెక్కు అందజేశారు. తర్వాత ధర్నాచౌక్‌లో సంతాప సభలో బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అధికారులు లక్ష్మణ రేఖ దాటుతూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
చర్చకు సిద్ధమా కేసీఆర్?
‘రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి ఎనిమిదేళ్లలో టీఆర్‌ఎస్ సర్కారు ఇచ్చిందెంత? కేంద్రం ఇచ్చింది ఎంతో చర్చకు సిద్ధమా కేసీఆర్’ అని కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీల దాకా అభివృద్ధి పనులకు కేంద్రమే నిధులిస్తోందని, చివరకు ప్రభుత్వం తెచ్చే అప్పుల్లో 90 శాతం కేంద్రమే ఇస్తోందని చెప్పారు. ఎనిమిదేళ్లలో సెక్రటేరియట్‌కు సీఎం ఎన్ని రోజులు వచ్చారో చెప్పాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment