సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీ బలపడటంతో తమ కుటుంబం చేతుల్లోంచి అధికారం చేజారిపోతుందని భయపడి సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. తన కొడుకు కేటీఆర్ ఇక ముఖ్యమంత్రి కాలేడన్న బాధ కేసీఆర్‌ను పీడిస్తోందని ఎద్దేవా చేశారు. నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి కేసీఆర్ గైర్హాజరుకావడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ఏవేవో సాకులు చెప్పి రాజకీయ దురుద్దేశాలతోనే నీతి ఆయోగ్‌పై బురద జల్లే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు.
ఢిల్లీలోని తన నివాసంలో ఆదివారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బంగారు తెలంగాణ పేరు చెప్పి కేసీఆర్ ఎనిమిదేళ్లుగా ఏ రకమైన పాలన చేస్తున్నారో రాష్ట్రంలోని ఏ గ్రామీణ ప్రాంతంలోనైనా దళిత, బీసీ, ఆడబిడ్డను అడిగినా చెప్తారని అన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడేవరకు టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం, నీతిఆయోగ్ చాలా మంచిగా కనిపించాయని, ఇప్పుడేమో వాటిని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీని విమర్శించే ముందు గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘దళిత నేతను సీఎంగా ఎందుకు చేయలేదు..? దళితులకు 3 ఎకరాల భూమిని ఎందుకు ఇవ్వలేదు..? నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగభృతిని ఇవ్వకుండా ఎందుకు మొండిచేయి చూపించారు..?’అని సీఎం కేసీఆర్‌ను కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
ఇళ్ల మంజూరులో వెనుకడుగు వేయం
ఇళ్ల మంజూరులో కేంద్రం వెనకడుగు వేసే ప్రసక్తి లేదని, కేంద్రం తన వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. 2014–15లో మంజూరు చేసిన మొత్తం ఇళ్లు ఇప్పటికీ కట్టలేదని, కట్టిన వాటినేమో గులాబీ కండువా కప్పుకున్నవాళ్లకే ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని 15 మంత్రిత్వశాఖలు కేసీఆర్ కుటుంబం చేతుల్లోనే ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వస్తే మెడికల్ కాలేజీలు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంటుందని, అయితే ప్రతిపాదనలు పంపాలని రెండుసార్లు కేంద్రమంత్రి లేఖలు రాసినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. అంతేగాక టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా రాష్ట్రంలో రైల్వే, ఎంఎంటీఎస్ సహా అనేక ప్రాజెక్ట్‌లు, పథకాల అమలులో జాప్యం జరుగుతోందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ ఏడాది అయినా గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి 75 ఏళ్ల విమోచన దినోత్సవాన్ని ధైర్యంగా నిర్వహించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: ‘కేసీఆర్‌ను గద్దె దించే వరకూ వదిలే ప్రసక్తే లేదు’
Comments
Please login to add a commentAdd a comment