సాక్షి హైదరాబాద్: హామీలను తుంగలోకి తొక్కిన ఝూటా పార్టీ టీఆర్‌ఎస్సేనని బీజేపీ నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ బాటలో టీఆర్‌ఎస్ కూడా ఎంఐఎంతో స్నేహం చేస్తూ తెలంగాణ అమరవీరులకు ద్రోహం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అమిత్ షా ప్రజల సమస్యలను, కేంద్రం ఇచ్చిన సహకారం మాత్రమే చెప్పారన్నారు. ఆయన అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేని కేటీఆర్ విమర్శలకు దిగడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పారు. కేటీఆర్ సీఎం కొడుకు కాబట్టే మంత్రి అయ్యి పెత్తనం చెలాయిస్తున్నారని, లేకపోతే అమెరికాలో ఉద్యోగం చేసుకునేవారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కుటుంబం ఎంఐఎంతో కుమ్మక్కై మతోన్మాదాన్ని, గూండాయిజాన్ని పెంచుతోందని, టీఆర్‌ఎస్ తెలంగాణ రజాకార్ల సమితిగా మారిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. మజ్లిస్ మద్దతు కోసం తెలంగాణయోధుల బలిదానాలను మరిచిన కేసీఆర్ ప్రజలను ఓట్లెలా అడుగుతారన్నారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం జరపడం లేదు కాబట్టి ‘రజాకార్లపై పోరాడిన యోధులకు ఇచ్చే పెన్షన్లు రద్దు చేస్తారా? నిజాం మీద పోరాడిన పవార్, గంగారాం, ఐలమ్మ, కొమురం భీంలను రాజద్రోహులుగా ముద్ర వేస్తారా?‘అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment