సాక్షి, హైదరాబాద్: జగద్గురు రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేసిన అంశంపై టీఆర్‌ఎస్, బీజేపీ నడుమ నడుస్తున్న ట్వీట్ల యుద్ధం మరింత వేడెక్కుతోంది. ‘వివక్షకు ప్రతిరూపం సమతామూర్తిని ఆవిష్కరించింది’అంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై కేంద్ర మంత్రి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఒక వేళ పోలీసులను పదిహేను నిముషాల పాటు పక్కకు తప్పిస్తే మేము ముస్లింలుగా వంద కోట్ల మంది హిందువులను అంతం చేస్తాం’అంటూ గతంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీ్దన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ‘ఒవైసీ, ఎంఐఎంతో జతకూడి సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇలాంటి ప్రకటనలను ఆమోదిస్తారు.
హిందువులను ఉద్దేశపూర్వకంగా ఊచకోత కోసిన రజాకార్ ఆర్మీని పొగుడుతారు’అని వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ‘కిషన్‌రెడ్డి గారూ.. ఎన్‌డీఏ ప్రభుత్వం తెలంగాణ పట్ల చూపుతున్న ఉదాసీన వైఖరి, కేంద్రం వివిధ రాష్ట్రాల పట్ల చూపుతున్న వివక్షను ఉద్దేశించి చేశాను. మీరు మాత్రం సంబంధం లేని విషయాలపై అస్పష్టంగా తెరమీదకు తెస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్ష అంశాలను పరిష్కరించేందుకు ప్రయత్నించండి’అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి 20 అంశాలను కేంద్రం చూపుతున్న వివక్షకు ఉదాహరణగా చూపారు.
దీనిపై మరోమారు కిషన్‌రెడ్డి స్పందిస్తూ ‘ధర్మపన్నాలు వల్లె వేస్తున్న వారు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే పాత నగరంలో అనేక హిందూ దేవాలయాలను ధ్వసం చేసిన ఎంఐఎంకు మద్దతు పలుకుతూ తమ కుటుంబపాలనకు మచ్చ పడిందనే విషయాన్ని తెలుసుకోవాలి. సమతావాదాన్ని గౌరవించే ఉద్దేశంతో ప్రధాని హాజరైన కార్యక్రమాన్ని కూడా అపహాస్యం చేస్తూ రాజకీయం చేస్తారు’అని ట్వీట్ చేశారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ ‘మొన్న ఐటీఐఆర్ ఇవ్వకున్నా దిగ్గజ ఐఐటీ కంపెనీలు తెచ్చుకున్నం. నిన్న జాతీయ హోదా ఇవ్వకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నం. నేడు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకున్నా ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నం. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రానికి అండగా మేము.. దేశానికే దండగ మీరు’అని కేటీఆర్ ప్రతిస్పందించారు.
దుష్ట మతోన్మాదంలో కుటుంబ పాలన సగం కూడా కాదు...
మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు ట్విట్టర్‌లో కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ ‘మీరు వాస్తవానికి కనీసం దగ్గరగా లేరు. ఇప్పుడు సమతామూర్తి ద్వారా భాగ్యనగర్ విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. ‘‘మీ వాళ్ల’’చార్మినార్ వల్ల కాదు’. ఇంకా అసహ్యకరమైన విషయం ఏమిటంటే కుటుంబ పాలనకు బ్రాండ్ అంబాసిడర్ సమానత్వం గురించి మాట్లాడుతున్నారు’అని ట్వీట్ చేశారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ ‘గాడ్సేను పూజించేవారికి మత సామరస్యం, బహుళత్వం వంటి పదాలు అర్థం అవడం కష్టమే. ఎనిమిదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్నా 80–20, మనం– వాళ్లు వంటివి తప్ప వేరేమీ మాట్లాడే స్థితిలో మీరు లేకపోవడంతో మీ మీద జాలి కలుగుతోంది. విషయమేమిటంటే దుష్ట మతోన్మాదంలో కుటుంబ పాలన సగం కూడా కాదు’అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment