సాక్షి, ఖమ్మం: పోలీసుల వేధింపులతో పురుగుల మందు తాగి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బీజేపీ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు సాయి గణేష్ మృతి తీరని లోటు అని బండి సంజయ్ అన్నారు. పాదయాత్రలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉందని, త్వరలోనే ప్రజలు చరమగీతం పడతారని దుయ్యబట్టారు. సాయి గణేష్ కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా బీజేపీ పార్టీ కార్యచరణ రూపొందించి కార్యకర్తలకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
‘ఖమ్మం లోని స్థానిక మంత్రి చేసిన అవినీతి అడ్డుకొని ధర్మం కోసం నిబద్ధతతో పని చేసిన సాయిని వేధించి అక్రమ కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకుని విధంగా చేశారు. కండ కవరం తలకెక్కి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న మీరు మనుషులు కాదు మానవ మృగాలు. బీజేపీని ఎదుర్కొలేక కార్యకర్తలను పోలీసుల చేత భయపెడుతున్నారు.. అలాంటి కొమ్ము కాసే పోలీసులను వదిలిపెట్టం’ అని హెచ్చరించారు.
సాయి గణేష్ మృతి
పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని పురుగులు మంది తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్ మృతిచెందారు. గణేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. కాగా బీజేపీ మజ్జూరు సంఘం జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్న సాయి గణేష్ ఖమ్మం జిల్లా కేంద్రంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు.
త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ రిధిలో బీజేపీ పార్టీ జెండా గద్దె కట్టేందుకు ప్రయత్నించగా దాన్ని కూల్చేశారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ నేతల ఒత్తిడితోపోలీసులు వేధిస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి బయపెడుతున్నారని ఆరోపిస్తూ ఆత్మాహత్యాయత్నం చేశాడు. దీంతో పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆ యువకుడు మరణించాడు. కాగా పోలీస్ స్టేషన్‌కు సంబంధం లేదనీ, బయటనే పురుగుల మందు సేవించాడని పోలీసులు చెబుతున్నారు. అయితే సీసటీవీ ఫుటేజ్ బయట పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కార్యాలయాలన్ని ముట్టడి చేసి మంత్రి అజయ్ కుమార్ రాజీనామా చేసేంతవరకు ఆందోళన చేపడతామంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment