సాక్షి, న్యూఢిల్లీ: ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బీఆర్‌ఎస్, ఎంఐఎం కలసి విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ‘‘ఎంఐఎం కార్యకర్తలు నా ఇల్లు, ఆఫీస్‌పైకి ర్యాలీగా వెళ్లి దాడికి యత్నిస్తే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఆత్మరక్షణ కోసం యత్నించిన బీజేపీ కార్యకర్తలపై ఉల్టా కేసులు పెట్టడం ద్వారా సమాజానికి ఏ సంకేతాలు పంపుతున్నారు? మా సహనాన్ని చేతగానితనంగా భావిస్తే.. ఖబడ్దార్..’’అని హెచ్చరించారు.
శనివారం ఢిల్లీలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.కొందరు పోలీసులు ప్రమోషన్లు, పోస్టింగుల కోసం బీఆర్‌ఎస్ చెప్పుచేతల్లో పనిచేస్తున్నారని.. బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అదే బీఆర్‌ఎస్, ఎంఐంఎం నేతలు, కార్యకర్తలు కుట్రలు చేస్తున్నా పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు.
ఎంఐఎం అడ్డా అని చెప్పుకుంటున్న పాతబస్తీకి వెళ్లి కాషాయ జెండా ఎగరేసిన చరిత్ర తమదని.. ఒక పార్టీకి, వర్గానికి కొమ్ము కాస్తే దీటుగా ఎదుర్కొనే సత్తా బీజేపీకి ఉందనే సంగతిని పోలీసులు, బీఆర్‌ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని సంజయ్ వ్యాఖ్యానించారు. ముస్లిం మేధావులు కూడా ఎంఐఎం ఆగడాలను చీదరించుకుంటున్నారని విమర్శించారు. ఎంఐఎం, బీఆర్‌ఎస్ అరాచకాలను, ఆగడాలను ఆపేదాకా బీజేపీ పోరాడుతుందన్నారు. బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment