
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన సాయి గణేష్ సూసైడ్ ఘటనపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. ఆయన వైరాలో కమ్మ కళ్యాణం మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఖమ్మంలో చిన్న విషయం జరిగితే దానిని అడ్డం పెట్టుకొని తనపై కుట్ర చేస్తున్నారని అన్నారు. కొంత మంది సూడో చౌదరీలు వారితో చేతులు కలిపి తనపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గంలో తనకు మంత్రి పదవి ఇవ్వడం అదృష్టమని తెలిపారు. మంత్రి వర్గంలో నుంచి తనను తొలగించేందుకు తనపై నిందలు మోపి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. అందుకే కమ్మ కులస్థులందరూ రాజకీయాలకతీతంగా ఐక్యతగా ఉద్యమం చేపట్టాలన్నారు. తాజాగా అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే సాయి గణేష్ ఘటనలో మంత్రి అజయ్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని బీజేపి, కాంగ్రెస్‌లు పాట్టుపడుతున్న విషయం తెలిసిందే. అజయ్ కుమార్‌ను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సాయి గణేష్ ఆత్మహత్య కేసులో దాఖలైన పిటిషన్ ఆధారంగా.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు తెలంగాణ హైకోర్టు నోటిసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 29 లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.