మాట్లాడుతున్న మంత్రి అజయ్‌కుమార్
సాక్షి, ఖమ్మం: ‘సీఎం కేసీఆర్ అందిస్తున్న అభివృద్ధి ఫలాలను అర్హుల చెంతకు చేర్చేందుకు సుశిక్షితుడైన సైనికుడిలా పనిచేస్తున్నా. మంత్రిగా జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. టీఆర్‌ఎస్ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికీ కేసీఆరే బాస్. ఆయన మాటే కార్యకర్తలకు శిరోధార్యం. ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ దండు ఏకతాటిపై ఉంది. ఉమ్మడి జిల్లాకు వరప్రదాయని అయిన సీతారామ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేసి రైతు కళ్లల్లో ఆనందం చూడటమే నా లక్ష్యం. పార్టీలో వర్గాలకు తావే లేదు. గ్రూపులు కట్టడం నాకు అలవాటు లేదు’.. మంత్రిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మనోగతం ఇది. కోవిడ్ విస్తృతిలోనూ ప్రజల మధ్యే ఉన్నా.. అంటున్న మంత్రి పువ్వాడతో ‘సాక్షి ప్రతినిధి’ ఇంటర్వ్యూ..
ప్రశ్న: మంత్రిగా జిల్లా అభివృద్ధి, సంక్షేమంలో మీ పాత్ర ఏమిటి?
జవాబు: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతైన అవగాహన ఉన్నవాడిని. వారి తక్షణావసరం ఏమిటో గుర్తెరిగిన వాడిని. అదే రీతిలో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా నిర్వహిస్తున్నాం. ధంసలాపురం ఆర్వోబీ, కొత్త ఆర్టీసీ బస్టాండ్, డబుల్ బెడ్‌రూం నిర్మాణానికి అవసరమైన నిధులు ప్రభుత్వం ద్వారా సమకూర్చి యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం. సీతారామ సాగర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేశాం. ఈ ఏడాదిలోపు పూర్తి చేసి రైతులకు అంకితం చేయాలనేది నా లక్ష్యం.
ప్రశ్న: గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల మాటేమిటి?
జవాబు: సీఎం కేసీఆర్ తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో పల్లె ప్రగతి ఒకటి. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా పల్లె ప్రగతిలో మూడో స్థానం సాధించింది. దీనిని మొదటి స్థానానికి తెచ్చేందుకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల తోడ్పాటుతో నిరంతరం కృషి చేస్తున్నా.
ప్రశ్న: జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులేమిటి?
జవాబు: సీతారామ సాగర్ ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాం. భూసేకరణకు ఏర్పడిన ఇబ్బందులను స్వయంగా నేనే జోక్యం చేసుకుని పరిష్కరించి ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి ప్రయత్నిస్తున్నా. మూడో పంపుహౌస్ పనులు చకచకా సాగుతున్నాయి. నిధుల కొరత ఉత్పన్నం కాకుండా సీఎం కేసీఆర్ అవసరమైనన్ని నిధులు విడుదల చేస్తున్నారు. సీతమ్మ బ్యారేజీ నిర్మాణంతో సహా ప్రస్తుతం రూ.15వేల కోట్లతో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ప్రశ్న: కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలేమిటి?
జవాబు: ఆరు నెలలుగా జిల్లా ప్రజలు కరోనా కోరల్లో చిక్కుకోకుండా ప్రభుత్వం తనవంతు ప్రయత్నాలు సమర్థంగా చేసింది. దీంతో జిల్లాలో మరణాల సంఖ్య అత్యంత స్వల్పంగా ఉంది. జిల్లా మంత్రిగా కరోనా కోరల్లోనే ఉండి ప్రజల మధ్య పనిచేశా. జిల్లాలో కరోనా టెస్ట్‌లు చేయించుకోవడానికి 25వేల ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్‌లు అందుబాటులో ఉంచాం.
ప్రశ్న: అభివృద్ధి పనుల వేగిరానికి నిధులెలా సమకూరుస్తున్నారు?
జవాబు: జిల్లాలో ప్రారంభించిన అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడమే లక్ష్యం. ఖమ్మం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్న నా లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుకు వెళ్తున్నా. ప్రతి డివిజన్‌లో రూ.5కోట్ల నుంచి రూ.7కోట్లతో అభివృద్ధి పనులు చేశా.
ప్రశ్న: ఉమ్మడి జిల్లాలో పట్టణ ప్రగతి వల్ల జరిగిన మార్పేమిటి?
జవాబు: మున్సిపాలిటీ, నగరపాలక సంస్థల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించేందుకు పట్టణ ప్రగతి ఎంతగానో ఉపయోగపడింది. తుప్పుపట్టిన, విరిగిపోయిన స్తంభాలను యుద్ధప్రాతిదికన మార్చాం. 215 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశాం. శానిటేషన్‌పై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
ప్రశ్న: ఖమ్మం నగరంలో మంచినీటి సమస్య ఎంతమేరకు పరిష్కారమైంది?
జవాబు: మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు వ్యక్తిగతంగా నేనే పూర్తి బాధ్యత తీసుకుంటున్నా. మిషన్ భగీరథ వల్ల నగరంలో మంచినీటి సమస్య కొంత తీరుతున్నా.. అన్ని ప్రాంతాల వారికి ప్రతిరోజు మంచినీరు ఇవ్వాలన్నదే నా ఆశయం. రాబోయే రోజుల్లో ప్రతి మనిషికి రోజుకు 150 లీటర్ల మంచినీటిని అందించి తీరుతాం.
ప్రశ్న: జిల్లా టీఆర్‌ఎస్‌లో వర్గపోరు ఉందంటారు.. దీనిపై మీరేమంటారు?
జవాబు: గ్రూపులు కట్టడం నాకు అలవాటు లేదు. ఆ మాటకొస్తే అది అత్యంత హేయమైన, అసహ్యకరమైన పనిగా భావిస్తా. ఎవరి నియోజకవర్గాల్లో వారు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ఎక్కడా వర్గం అనే పదం లేకుండా కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటున్నా. నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకవైపు అభివృద్ధి.. మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు.
ప్రశ్న: నగరపాలక సంస్థ ఎన్నికలను మీ పార్టీ ఎలా ఎదుర్కొనబోతోంది?
జవాబు: గ్రామ పంచాయతీ, మండల పరిషత్, సహకార, మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేని మెజార్టీని ప్రజలు కట్టబెట్టారు. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ఖమ్మం ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు పెట్టని కోటగా మారింది.
ప్రశ్న: మంత్రిగా మీ ప్రాధాన్యత అంశాలేంటి?
జవాబు: పూర్తి వ్యవసాయరంగంపై ఆధారపడిన ఖమ్మం జిల్లా ప్రజలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పంటకు గిట్టుబాటు ధరతోపాటు మార్కెట్ సౌకర్యం కల్పించాలన్న దిశగా వేసిన అడుగులు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కొత్త బస్టాండ్, ఆర్వోబీ, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి దసరాకు సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించాలని సంకల్పించాం. అలాగే నగరంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నాం.
ప్రశ్న: నూతన పరిశ్రమలకు ఉన్న అవకాశాలేంటి?
జవాబు: ఉమ్మడి జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. కొత్తగూడెంలో స్పెషల్ ఎకనమిక్ జోన్(ఎస్‌ఈజెడ్) కింద 700 ఎకరాల భూమిని సేకరించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని, అలాగే అనుబంధ పరిశ్రమలు నెలకొల్పాలని సంకల్పించాం. ఇదే తరహాలో వైరా మండలంలోనూ 140 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాం. ఇక్కడ సైతం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నాం.
ప్రశ్న: మంత్రిగా ఏడాది కాలంలో సంతృప్తినిచ్చిన అంశాలేంటి?
జవాబు: ఖమ్మం జిల్లా నుంచి మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నాననే సంతృప్తి ఉంది. ఇటు పార్టీపరంగా.. అటు ప్రభుత్వపరంగా ప్రజలకు అనుక్షణం అందుబాటులో ఉంటూ.. వారిలో ఒకరిగా మెలుగుతున్నాననే ఆనందం కలిగింది. ఉభయ జిల్లాల అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ కరోనాపై ప్రజల్లో గల భయాందోళనలను తగ్గించగలిగాం. మంత్రిగా నా పనితీరుపై ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో వ్యక్తం చేసిన సంతృప్తి.. భుజం తట్టిన తీరు మరింత స్ఫూర్తినిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment