కూడేరు: వారిది ప్రేమ వివాహం..పెద్దలను ఒప్పించి ఏడేళ్ల కిందట ఏడడుగులు నడిచారు.. మొదటి సంతానంగా ఆడబిడ్డ జన్మించింది. కూతురులోనే వారు కొడుకును చూసుకున్నారు.. అల్లారుముద్దుగా పెంచుతున్నారు..ముద్దుముద్దు మాటలతో.. చిలిపి చేష్టలతో మారాం చేస్తుంటే..మురిసిపోయారు.. కాళ్లకు పట్టీలు పెట్టుకొని ఆ ఇంట ఘల్లుఘల్లుమంటూ గెంతులేస్తుంటే గారాలపట్టీగా సంబరపడ్డారు. రెండో సంతానంలోనూ ఆడబిడ్డే అని ఆనందపడ్డారు..ఇక పిల్లలు చాలనుకున్నారు.. అంతలోనే ప్రమాదంలో పెద్ద కుమార్తె ఆయువు ఆగిందన్న విషయం తెలిసి..ఆ తల్లిదండ్రులకు గుండెలు పగిలినంత పని అయ్యింది.. గురువారం జరిగిన ఈ ఘటనతో అప్పటి వరకు కళకళలాడిన కళగళ్ల గ్రామంలో విషాదం అలుముకుంది.
కూడేరు మండలం కలగళ్లలో గురువారం మోక్షిత (5) అనే విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. స్థానికులు తెలిపిన మేరకు.. కలగళ్లకు చెందిన తపాలా ఉద్యోగి అమృతకళకు లోకేష్‌చౌదరితో ఏడేళ్ల కిందట ప్రేమవివాహం జరిగింది. అనంతపురంలో ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె మోక్షిత (5)ను అమ్మమ్మ ఊరు (కలగళ్ల)లో ఉంచి కూడేరులోని ప్రైవేట్ స్కూలులో చదివిస్తున్నారు. రెండు నెలల బాలింత అయిన అమృతకళ ప్రస్తుతం పుట్టింటిలో ఉంది. యూకేజీ చదువుతున్న మోక్షిత గురువారం బడికి వెళ్లనంటూ మొండికేసింది. మేనమామ నచ్చజెప్పి స్కూల్ ఆటో ఎక్కించాడు. అయితే ఆటో కదిలి కొంతదూరం వెళ్లాక మోక్షిత కిందకు దూకేసింది. రోడ్డుపై బలంగా పడటంతో తల భాగం, కుడిచెవివద్ద రక్తస్రావమైంది. వెంటనే 108 వాహనంలో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. రక్తం గడ్డ కట్టుకుపోయిందని, వెంటనే బెంగళూరుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు బెంగళూరుకు తీసుకెళుతుండగా మార్గం మధ్యలోనే మోక్షిత ప్రాణాలు విడిచింది. అల్లారుముద్దుగా పెంచుకున్న పెద్ద కుమార్తె ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
కన్నవాళ్లకు కన్నీళ్లే మిగిలాయి!
Published Thu, Aug 17 2017 10:49 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement
Advertisement