బాలికకు ‘పరీక్ష’
♦ ఇంట్లో అమ్మ మృతదేహం..
♦ పరీక్ష రాసొచ్చాక అంత్యక్రియలు
పాపన్నపేట: నవ మాసాలు మోసి.. పేగు తెంచి జన్మ నిచ్చిన.. అమ్మ అంతిమ యాత్ర ఓ వైపు, పదేళ్లు చదివి భవితకు బాటలు వేసే పదో తరగతి పరీక్ష మరోవైపు.. ఆ చిన్నారిని కలవరపరిచాయి. దుఃఖాన్ని దిగమింగుకుంటూ చివరకు ఆ చిట్టితల్లి శనివారం పరీక్షకు హాజరైంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మిన్‌పూర్ గ్రామానికి చెందిన రత్నయ్య, మరియమ్మ దంపతులకు అనురాధ అనే కూతురు, కుమారుడు ఉన్నారు. అనురాధ కుర్తివాడ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతు పాపన్నపేటలో పరీక్షలు రాస్తోంది. నిరుపేద కుటుంబానికి చెందిన మరియమ్మ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది.
భర్త రత్నయ్య ఉన్నంతలో స్థానిక వైద్యం చేయిస్తుండగా.. శుక్రవారం మరియమ్మ మృతిచెందింది. శనివారం అంత్యక్రియలు నిరృహించాలని నిర్ణయించారు. కన్నతల్లి మరణం ఓవైపు, పదో తరగతి ఆంగ్లం పరీక్ష మరోవైపు అనురాధను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. భవిష్యత్తును, పెద్దల సలహాను దృష్టిలో పెట్టుకొన్న ఆ చిన్నారి పరీక్ష రాసేందుకు నిర్ణయించుకుంది. శోక సంద్రమైన ఆ ఇంటిని, అచేతనంగా పడి ఉన్న అమ్మ శవాన్ని వదిలి పరీక్ష కేంద్రానికి పయనమైంది. దుఃఖాన్ని దిగమింగుకుంటూ, ధైర్యాన్ని కూడదీసుకుంటూ ఇంగ్లిష్ పరీక్ష రాసి వచ్చాక కన్న తల్లి అంతిమయాత్రలో పాల్గొంది.