మాట్లాడుతున్న జడ్జి నసీమా సుల్తానా
-
రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి నసీమా సుల్తానా
మంచిర్యాల టౌన్ : విద్యార్థులు లక్ష్యం లేకుండా ముందుకు వెళ్లవద్దని, భవిష్యత్తును దష్టిలో ఉంచుకుని ఓ ప్రణాళికతో చదువును కొనసాగిస్తూ విజయాన్ని అందుకోవాలని రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి నసీమా సుల్తానా అన్నారు. మంచిర్యాల పట్టణంలోని వివేక వర్ధిని డిగ్రీ, పీజీ కళాశాలలో శనివారం మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. విద్యార్థి దశలో ఉన్నవారు ఎలాంటి లక్ష్యం లేకుండా చదవడం వల్ల, అల్లరి చిల్లరిగా తిరుగుతూ చదువును అశ్రద్ధ చేయడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకోలేక పోతారన్నార ని వివరించారు.
కళాశాలలో చేరగానే ర్యాగింగ్ చేసేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపిస్తున్నారని, ఒక్కసారి ర్యాగింగ్ చేస్తూ కేసు నమోదైతే వారి భవిష్యత్తు నాశనం అవుతుందని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని, నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, వారు స్పందించకుంటే నేరుగా కోర్టుకు వారి సమస్యను విన్నవించుకోవచ్చని సూచించారు.
లాయర్‌ను పెట్టుకునే స్థోమత లేని వారు, కోర్టుకు విన్నవిస్తే, ప్రభుత్వం తరుఫున లాయర్‌ను ఏర్పాటు చేస్తామని, కోర్టు ద్వారా బాధితులకు తప్పనిసరిగా న్యాయం అందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త సత్తయ్య, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఉపాధ్యక్షుడు సదయ్య, వీవీడీసీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఎస్సై ఆకుల అశోక్, న్యాయవాదులు చిదానంద కుమారి, మల్లారెడ్డి, జగన్, ఉమేశ్, చంద్రగిరి రమేశ్, గంగయ్య, ఇండ్ల వెంకట్ పాల్గొన్నారు.