సమావేశాన్ని అడ్డుకున్న విద్యార్థి సంఘాలు
అనంతపురం ఎడ్యుకేషన్ : బయోమెట్రిక్ పద్ధతి అమలుకన్నా ముందు హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం ఉదయం స్థానిక బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న వార్డన్ల సమావేశాన్ని వీరు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనేక హాస్టళ్లలో కనీస వసతులు లేక విద్యార్థులు అల్లాడుతున్నారన్నారు.
ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ విద్య బలహీనపడుతోందన్నారు. వార్డెన్లు స్థానికంగా ఉండడం లేదని, వంట మనుషులపై ఆధారపడుతున్నారన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించిందన్నారు. వీటిపై స్పష్టమైన హామీ ఇచ్చేదాకా కదిలేదే లేదని స్పష్టం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు బయటకి పంపారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం బండి పరుశురాం, ఏఐఎస్‌ఎఫ్ జాన్సన్, బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సంఘం సాకే నరేష్, శివ, సురేష్, అనిల్, మధు, రాఘవ, భార్గవ్, రితేష్ తదితరులు పాల్గొన్నారు.