ఎడ్‌సెట్‌లో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు
మేనమామ సహకారంతో చదువులో రాణింపు
చీపురుపల్లి: ఎలాంటి ప్రత్యేక శిక్షణ తీసుకోకుండానే ఇంటిదగ్గరే చదువుకుంటూ అనుకున్నది సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్లిన చీపురుపల్లి పట్టణానికి చెందిన స్వాతిశ్రీదివ్య నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. పేదింటిలో జన్మించిన స్వాతిశ్రీదివ్య తాజాగా ఎడ్‌సెట్(గణితం)లో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించి యువతకు మోడల్‌గా నిలిచింది. తండ్రి లేకపోయినప్పటికీ దిగులు చెందకుండా మేనమామ సహకారంతో చదువుకుంటూ ర్యాంకు సాధిం చడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని కొత్తఅగ్రహారానికి చెందిన పట్నాల స్వాతిశ్రీదివ్య తండ్రి ఈశ్వరశాస్త్రి పట్టణంలోని ఆంజనేయపురంలో గల శ్రీ మారుతీ హరిహర క్షేత్రంలో ప్రధాన అర్చకునిగా పని చేసేవారు. 2015 జనవరిలో ఆయన అకస్మాత్తుగా మృతి చెందారు. అప్పటికి స్వాతిశ్రీదివ్య డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
తండ్రి మృతి చెందడంతో పిల్లల చదువులు ఆగిపోకుండా స్వాతిశ్రీదివ్య మేనమామ గౌరీశంకరశాస్త్రి వారి బాధ్యత తీసుకుని చదువులు కొనసాగేందుకు పూర్తి సహకారాన్ని అందించారు. ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు పట్టణంలోని పోలీస్‌లైన్ ప్రాథమిక పాఠశాలలోను, 7వ తరగతి నుంచి పదో తరగతి వరకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోను, ఇంటర్మీడియట్ శ్రీనివాసా జూనియర్ కళాశాలలోను స్వాతిశ్రీదివ్య చదువుకుంది. అనంతరం ఎంపీసీ గ్రూపులో డిగ్రీని శ్రీకాకుళం మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తిచేసింది. స్వాతిశ్రీదివ్య తమ్ముడు వెంకటసాయి చైతన్య ఇటీవల ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 461 మార్కులు సాధించాడు. తండ్రి లేకపోయినప్పటికీ పిల్లలు చదువులో రాణించడం పట్ల తల్లి పద్మకుమారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
మెరిసిన ‘స్వాతి’ముత్యం
Published Fri, Jun 3 2016 10:53 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement