అక్రమాలపై విద్యార్థుల ఆగ్రహం
అక్రమాలపై విద్యార్థుల ఆగ్రహం
Published Thu, Aug 25 2016 1:07 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
– సంక్షేమభవన్‌లో ధర్నా
– బీసీ సంక్షేమాధికారిపై విచారణ జరపాలంటూ డిమాండ్
కర్నూలు(అర్బన్): జిల్లా బీసీ సంక్షేమాధికారి సంజీవరాజు అవినీతి, అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కె. రామకృష్ణ, మాల విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు కె. వెంకటేష్, ట్రై బల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్. చంద్రప్ప ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టుకొని సంక్షేమభవన్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంజీవరాజు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఒక అటెండర్ కుటుంబ సభ్యుల పేరుతో నకిలీ ఓచర్లు సష్టించుకొని రూ.44,700 అక్రమంగా కాజేశారని ఆరోపించారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి సంబంధం లేకుండా ఆళ్లగడ్డ, కర్నూలు కళాశాల బీసీ వసతి గహాల్లో స్వంతగా ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. తన వాహనానికి సంబంధించి కారు మీద ప్రభుత్వ ధనాన్ని డ్రా చేసుకున్నారని, అలాగే మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు చెల్లించాల్సిన సొమ్మును కూడా స్వాహా చేశారని విమర్శించారు. శ్రీ నిధి ఆఫీస్ ఆటో మిషన్ బిల్ నెం: 151/14–18పై నకిలీ ఓచర్ సష్టించుకొని రూ.10,839 వాడుకున్నారని, పూలే విగ్రహానికి ప్రభుత్వం విడుదల చేసిన రూ.4.80 లక్షలను 2014 జూన్ 24వ తేదిన నగరంలోని కష్ణానగర్ ఆంధ్రాబ్యాంక్‌లో జమ చేశారన్నారు. బినామీ కారు అద్దెకు ఆ నిధుల్లో నుంచి రూ.2,24,000 లక్షలు డ్రా చేశారని ఆరోపించారు. వసతి గహం సంక్షేమాధికారులను పలు రకాలుగా వేధిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో టీఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి పీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
విచారణకు ఆదేశం?
జిల్లా బీసీ సంక్షేమాధికారి సంజీవరాజుపై జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. గత నెలలో బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎల్‌ఆర్ నెం:ఆర్‌సీ డీ/1918,తేది 27/07/16న జారీ అయిన లేఖ, ఈ నెల 12వ తేదిన ఎస్‌సీ,ఎస్‌టీ,బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్, ట్రై బల్ స్టూడెంట్స్ ఫెడరేషన్, ఎరుకల హక్కుల పోరాట సమితి, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాలు చేసిన ఆరోపణలు, అందించిన ఫిర్యాదుల నేపథ్యంలో కలెక్టర్ విచారణ జరిపించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. విచారణాధికారిగా శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ ఎంవీ సుబ్బారెడ్డిని నియమిస్తు విచారణను ఈ నెల 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆర్‌సీ ఏజే/5419/2015 మేర ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
Advertisement
Advertisement