Welfare Bhavan
-
సమావేశమా.. అయితే సందర్శకులు బంద్!
సాక్షి, హైదరాబాద్: ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, స్వయం ఉపాధికి రాయితీ రుణాలు, కల్యాణలక్ష్మి, దళితబంధు లాంటి ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేస్తున్న వివిధ సంక్షేమ శాఖల కార్యాలయాలకు నిత్యం సందర్శకుల తాకిడి ఉంటుంది. పేదలకు నేరుగా లబ్ధి చేకూరే ఈ పథకాలు అమలు చేస్తున్న ప్రధాన కార్యాలయాలున్నది మాసాబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో. వందల మంది లబ్ధిదారులు ఇక్కడ సంబంధిత శాఖల ఉన్నతాధికారులను నేరుగా కలసి తమ గోడు వినిపించుకుంటారు. అలాంటి వారి సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కారం లభిస్తుంది. ఆ నమ్మకంతోనే ఇక్కడికి రాష్ట్రం నలు మూలలనుంచి వస్తుంటారు. కానీ ప్రస్తుతం సందర్శకులపై ఆంక్షలు విధించారు. గిరిజన సంక్షేమ శాఖ నిర్వహణలో ఉన్న ఈ భవన్లో సందర్శకులను అనుమతించడం లేదు. ఈ శాఖ ఉన్నతాధికారుల సమావేశాల పేరిట ఇతర కార్యాలయాలకు వచ్చే వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటున్నారు. రోజూ ఈ శాఖ అధికారులకు సంబంధించి ఏదో ఒక సమావేశం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆరు అంతస్తుల్లో వివిధ కార్యాలయాలున్న సంక్షేమ భవన్లో మొదటి అంతస్తు వద్దే సందర్శకులను నిలువరిస్తుండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు సంబంధిత ఉన్నతాధికారులను కలవకుండా ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. గురుకుల ప్రవేశాలతో రద్దీ.. ప్రస్తుతం సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి సీట్ల కేటాయింపులన్నీ ఆన్లైన్ పద్ధతి ద్వారానే జరుగుతున్నా.. వివరాల్లో పొరపాట్లు, రిపోర్టింగ్ వివరాలు, ఇతర సమస్యలతో పెద్ద సంఖ్యలో పిల్లల తల్లిదండ్రులు ప్రతిరోజూ సంక్షేమ భవన్‌కు వస్తున్నారు. ముఖ్యంగా రెండో అంతస్తులోని బీసీ గురుకుల సొసైటీ కార్యాలయానికి విద్యార్థులు, తల్లిదండ్రుల తాకిడి అధికంగా ఉంటోంది. ఈ క్రమంలో మొదటి అంతస్తు వరకే సందర్శకులను అనుమతించడం, పైఅంతస్తుల్లోకి పంపకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బందిని నిలదీస్తున్న కొందరిని లిఫ్ట్ ద్వారా అనుమతిస్తుండగా.. అధికశాతం సందర్శకులను నిలిపివేస్తుండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళితబంధు పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు సైతం సంక్షేమ భవన్‌లోని ఐదో అంతస్తులో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయ అధికారులను కలిసేందుకు అనుమతి దొరకడం లేదు. కాగా, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల సమావేశం మందిరం మెట్ల దారి పక్కనే ఉందని, సమీక్షలు, సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎవరినీ అనుమతించవద్దని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించినందునే సందర్శకులను నిలిపివేస్తున్నామని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. -
అక్రమాలపై విద్యార్థుల ఆగ్రహం
– సంక్షేమభవన్‌లో ధర్నా – బీసీ సంక్షేమాధికారిపై విచారణ జరపాలంటూ డిమాండ్ కర్నూలు(అర్బన్): జిల్లా బీసీ సంక్షేమాధికారి సంజీవరాజు అవినీతి, అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కె. రామకృష్ణ, మాల విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు కె. వెంకటేష్, ట్రై బల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్. చంద్రప్ప ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టుకొని సంక్షేమభవన్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంజీవరాజు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఒక అటెండర్ కుటుంబ సభ్యుల పేరుతో నకిలీ ఓచర్లు సష్టించుకొని రూ.44,700 అక్రమంగా కాజేశారని ఆరోపించారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి సంబంధం లేకుండా ఆళ్లగడ్డ, కర్నూలు కళాశాల బీసీ వసతి గహాల్లో స్వంతగా ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. తన వాహనానికి సంబంధించి కారు మీద ప్రభుత్వ ధనాన్ని డ్రా చేసుకున్నారని, అలాగే మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు చెల్లించాల్సిన సొమ్మును కూడా స్వాహా చేశారని విమర్శించారు. శ్రీ నిధి ఆఫీస్ ఆటో మిషన్ బిల్ నెం: 151/14–18పై నకిలీ ఓచర్ సష్టించుకొని రూ.10,839 వాడుకున్నారని, పూలే విగ్రహానికి ప్రభుత్వం విడుదల చేసిన రూ.4.80 లక్షలను 2014 జూన్ 24వ తేదిన నగరంలోని కష్ణానగర్ ఆంధ్రాబ్యాంక్‌లో జమ చేశారన్నారు. బినామీ కారు అద్దెకు ఆ నిధుల్లో నుంచి రూ.2,24,000 లక్షలు డ్రా చేశారని ఆరోపించారు. వసతి గహం సంక్షేమాధికారులను పలు రకాలుగా వేధిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో టీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి పీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. విచారణకు ఆదేశం? జిల్లా బీసీ సంక్షేమాధికారి సంజీవరాజుపై జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. గత నెలలో బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎల్ఆర్ నెం:ఆర్సీ డీ/1918,తేది 27/07/16న జారీ అయిన లేఖ, ఈ నెల 12వ తేదిన ఎస్సీ,ఎస్టీ,బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్, ట్రై బల్ స్టూడెంట్స్ ఫెడరేషన్, ఎరుకల హక్కుల పోరాట సమితి, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు చేసిన ఆరోపణలు, అందించిన ఫిర్యాదుల నేపథ్యంలో కలెక్టర్ విచారణ జరిపించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. విచారణాధికారిగా శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ ఎంవీ సుబ్బారెడ్డిని నియమిస్తు విచారణను ఈ నెల 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆర్సీ ఏజే/5419/2015 మేర ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. -
ఇంకా కుదురుకోని ‘సంక్షేమం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంకా విభజన బాలారిష్టాలను అధిగమించలేకపోతోంది. ముఖ్యం గా ఉన్నతోద్యోగుల విభజన కారణంగా సంక్షేమ శాఖల పనితీరు మందగించింది. రాష్ట్ర విభజన జరి గి పధ్నాలుగు నెలలు దాటినా పరిపాలనాపరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు పూర్తిస్థాయిలో ఇంకా కుదురుకోలేదు. కీలకమైన పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్ సంక్షేమ భవన్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ డెరైక్టరేట్లలో ఉద్యోగుల కొరత కారణంగా పని ఒత్తిడి పెరిగింది. ఎస్సీ అభివృద్ధిశాఖలో ఒక అదనపు డెరైక్టర్ పోస్టు ఏపీకి కేటాయించడంతో తెలంగాణకు విడిగా ఒక స్థానాన్ని సృష్టించాల్సి వస్తోంది. ఇద్దరు జేడీలు ఉండగా వారిలో ఒకరు డిప్యూటేషన్‌పై వెళ్లడంతో ఆ పోస్టును కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఇక సాంఘిక సంక్షేమ అధికారుల(ఎస్‌డబ్ల్యూవో) పోస్టులు మొ త్తం 858 ఉండగా వాటిలో 177 ఖాళీగా ఉన్నాయి. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారుల(డీఎస్‌డబ్ల్యూవో) పోస్టులు 11కుగాను 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏఎస్‌డబ్ల్యూవో పోస్టులు 61 కాగా అం దులో 8 ఖాళీగా ఉన్నాయి. మల్టీ జోనల్/జోనల్ పోస్టులు కలుపుకుంటే 150 పోస్టులకుగాను 32 ఖాళీగా ఉన్నాయి. ఎస్టీ శాఖకు సంబంధించి ఏపీకి అడిషనల్ డెరైక్టర్ పోస్టు వెళ్లడంతో ఇక్కడ ఏడీ పోస్టును సృష్టించాల్సి ఉంది. దీనితోపాటు ఒక జేడీ, రెండు డీడీ పోస్టులు, ఆరు సెక్షన్ సూపరింటెండెంట్ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, 10 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, రెండు జోనల్ అగ్రికల్చర్ ఆఫీసర్, ఏడు ఏటీడబ్ల్యూవో పోస్టులు, 83 గ్రేడ్-2 హెడ్మాస్టర్ పోస్టులు, వంటవాళ్లు 201 మంది, 129 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు గ్రేడ్-2 పోస్టులు, 352 సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఏఎస్) పోస్టులు, 259 సెకండరీ గ్రేడ్ టీచర్ల(జీపీఎస్)పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీసీ సంక్షేమ శాఖ అదనపు డెరైక్టర్ పోస్టు ఏపీకి కేటాయించడంతో జాయింట్ డెరైక్టర్ ఇన్చార్జి డెరైక్టర్‌గా కొనసాగిస్తున్నారు. అదనపు డెరైక్టర్ పోస్టును సృష్టించాల్సిన అవసరం ఏర్పడింది. బీసీ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు 750కుగాను 200 ఖాళీగా ఉన్నాయి. మొత్తం 1500 కామాటీ, వంట వాళ్లు, వాచ్‌మన్ పోస్టులకుగాను 310 ఖాళీగా ఉన్నాయి.