‘జన్మభూమి’లో విద్యార్థులే కూలీలు!
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే జన్మభూమి కార్యక్రమం విద్యార్థులకు పెద్ద కష్టాన్నే తచ్చిపెట్టింది. గ్రామ సభకు హాజరయ్యే వారి కోసం విద్యార్థులు కూలీల అవతారమెత్తి కుర్చీలు మోయాల్సి వచ్చింది. ఈ సంఘటన బుధవారం కల్లూరు మండలం గోకులపాడు గ్రామంలో చోటుచేసుకుంది. నిబంధనల ప్రకారం జన్మభూమి కార్యక్రమం పాఠశాలలో నిర్వహించకూడదు. వేదిక దొరకకపోవడమో..స్థలాభావమో... కారణమేదయితేనేం.. నోడల్ అధికారి ఏజేసీ రామస్వామి ఆధ్వర్యంలో సర్పంచ్ లక్ష్మీవరదారెడ్డి అధ్యక్షతన ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సభకు హాజరైన ప్రజలకు అవసరమైన కుర్చీలు వేయించలేదు. జనం నిలబడి అధికంగా ఉండటంతో మరికొన్ని కుర్చీలు ఆటోలో తీసుకువచ్చారు. ఆటో వద్ద నుంచి సభ వద్దకు విద్యార్థులతో కుర్చీలను మోయించారు. పిల్లలు బడికి..పెద్దలు పనికి అంటూ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన గురించి చెప్పే అధికారులే ఇలా విద్యార్థులతో పనిచేయించడం విమర్శలకు తావిచ్చింది.
- కల్లూరు