వ్యసనాలకు దూరంగా ఉండాలి
Published Mon, Aug 29 2016 9:28 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
బోట్‌క్లబ్ (కాకినాడ) :
వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, సాహిత్య అవార్డు గ్రహీత, నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ విద్యార్థులకు ఉద్బోధించారు. స్థానిక విద్యుత్‌నగర్‌లో శ్యామ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో సోమవారం ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు హాజరవుతున్న విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చదువుకొనేటప్పుడు మంచి వాతావరణం ఎంతో అవసరమని యండమూరి పేర్కొన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నెల్లాల్ల ముందు నుంచి ఎటువంటి మాంసాహారం తీసుకోకుండా ఉంటే మంచిదన్నారు. పరీక్షకు వెళ్లేటప్పుడు నేను తప్పకుండా ఈ పరీక్షలో పాసవుతానన్న దృఢసంకల్పంతో ఉండాలని సూచించారు. పరీక్ష హాల్‌లో ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే సమాధానలు రాయడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. ఒక్కసారి ప్రశ్నపత్రాన్ని క్షుణ్ణంగా చదువుకొని ఆ తర్వాత ఆలోచించుకొని జవాబులు రాయాలన్నారు. ప్రస్తుతం విద్యార్థులు సెల్‌ఫోన్‌తో ఎక్కువ సేపు కాలక్షేపం చేస్తున్నారని, పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో దానికి దూరంగా ఉండాలన్నారు. శ్యామ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ గుంటూరు శ్యామ్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకొని పరీక్షలు సక్రమంగా రాసి ఉద్యోగాలు సాధించాలని కోరారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Advertisement