ఇంకెత కాలానికో ప్రోత్సాహకాలు ?
Published Sun, Jan 22 2017 11:55 PM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM
రాయవరం :
విద్యార్థుల ‘ప్రతిభ’ను కూడా కూడా ప్రభుత్వం ప్రచారానికి వాడుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ట్యాబ్‌లు, నగదు పురస్కారం అందజేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకూ వాటిని విద్యార్థులకు అందించలేదు. ప్రతిభ అవార్డులు పొందిన వారికి ట్యాబ్‌లు, నగదు అందజేస్తామంటూ గత నెలలో విజయవాడ తీసుకెళ్లిన విద్యార్థులకు వారి చేతిలో సర్టిఫికెట్లు పెట్టి పంపించారు.
‘ప్రతిభ’ చూపిన వారికి..
చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిభ అవార్డులను అందజేస్తోంది. 10వ తరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిభా పురస్కారాలను అందజేస్తోంది. అక్టోబరు 15న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రతిభ అవార్డులకు ఎంపికైన విద్యార్థులకు నగదు, ట్యాబ్‌ల పంపిణీ చేస్తారని సమాచారం అందించారు. ప్రతిభ పురస్కారాలకు ఎంపికైన వారంతా విజయవాడ వెళ్లారు. తీరా అక్కడ ముఖ్యమంత్రి ఒకరిద్దరు విద్యార్థులకు మాత్రమే ట్యాబ్‌లు, నగదు అందించారు. మిగిలిన విద్యార్థులకు తదుపరి అందజేస్తామని తెలిపినా నేటి వరకూ ట్యాబ్‌లు, నగదు అందలేదు.
జిల్లాలో 423 మంది ఎంపిక..
ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనల ప్రకారం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివిన 423 మంది ప్రతిభ పురస్కారాలకు ఎంపికయ్యారు. 10వ తరగతి నుంచి జిల్లాలో 384 మందికి, ఇంటర్ నుంచి 39 మందికి ప్రతిభ అవార్డులు ప్రకటించారు. వీరికి ఒక్కొక్కరికీ రూ.20 వేల నగదు, ట్యాబ్‌లు అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటిని అందుకోవడం కోసం జిల్లా నుంచి విద్యార్థులు విజయవాడ వెళ్లారు. అక్కడ ఒక్కో జిల్లా నుంచి ఒకరిద్దరిని ఎంపిక చేసి వారికి సీఎం చేతుల మీదుగా నగదు, ట్యాబ్‌లు అందజేశారు. మిగిలిన వారికి ప్రతిభ అవార్డుల సర్టిఫికెట్లు మాత్రమే అందించారు. నగదు, ట్యాబ్‌లు విద్యార్థులు చదివిన పాఠశాలలు, కళాశాలలకు పంపిస్తామని తెలిపారు.
సార్ వచ్చాయా..
‘సార్! మాకు ట్యాబ్‌లు వచ్చాయా? మా అకౌంట్లలో నగదు జమ అయిందా?’ అంటూ విద్యార్థులు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలను అడుగుతున్నారు. ఇప్పటికే ప్రతిభ అవార్డులు పొందిన పలువురు విద్యార్థులు కడప జిల్లా ఇడుపులపాయ, కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీల్లో చేరారు. అక్కడ నుంచి స్వస్థలాలకు వచ్చినప్పుడు, ఫోన్ల ద్వారా ట్యాబ్‌లు, నగదు గురించి వాకబు చేస్తున్నారు. తరచుగా విద్యార్థులు వీటి గురించి అడుగుతుంటే ఏమి చెప్పాలో తెలియడం లేదని ఒక ప్రైవేటు పాఠశాల కరస్పాండెంట్ ‘సాక్షి’కి తెలిపారు.
ట్యాబ్‌లు నేటికీ ఇవ్వలేదు..
విజయవాడలో జరిగిన సమావేశంలో ట్యాబ్‌లు స్టేజ్ మీదకు తెస్తే ఇస్తున్నారనుకున్నాం. కేవలం సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చారు. ట్యాబ్‌లు పంపిస్తామన్నారు కానీ ఇప్పటికీ పంపలేదు.
– చొల్లంగి జానకిరామ్, ప్రతిభ అవార్డు గ్రహీత, పసలపూడి, రాయవరం మండలం
ఉన్నత చదువులకు ఉపయోగం..
ప్రతిభ అవార్డు నగదును అకౌంట్‌లో వేస్తానన్నారు. కానీ జమ కాలేదు. ట్యాబ్‌లు ఇస్తే ఉన్నత చదువులకు ఉపయోగంగా ఉంటుంది. ట్యాబ్‌లు ఇస్తారని ఆశతో వెళ్లినా అక్కడ ఇవ్వలేదు సరికదా నేటికీ అందజేయలేదు.
– మెల్లం శ్రీఅమృత, ప్రతిభ అవార్డు గ్రహీత, తొస్సిపూడి, బిక్కవోలు మండలం
Advertisement
Advertisement