
బస్సుల కోసం విద్యార్థుల రాస్తారోకో
చేవెళ్ల: పాఠశాలలు, కళాశాలల సమయాలకు బస్సులు రాకపోవడం, వచ్చిన బస్సులు కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా చాలకపోవడం, ఫుట్‌బోర్డుపై ప్రయాణం చేయడం తదితర ఇబ్బందులతో విసిగి వేసారిన విద్యార్థులు శనివారం రాస్తారోకో నిర్వహించారు. మండల పరిధిలోని చిట్టెంపల్లి కౌకుంట్ల బస్‌స్టేజీ వద్ద పలు గ్రామాల విద్యార్థులు రోడ్డుపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు రాఘవేందర్, ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్లలోని పలు పాఠశాలలు, కళాశాలలకు వికారాబాద్-చేవెళ్ల రూటులో వేలాది మంది విద్యార్థులు నిత్యం విద్యాభ్యాసానికి తమతమ గ్రామాలనుంచి రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు.
కాగా వీరి సంఖ్యకు అనుగుణంగా బస్సులను నడపాలని గతంలో ఎన్నోసార్లు ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తిచేసినా పట్టించుకోవడంలేదన్నారు. ఉదయం వేళల్లో సమయానికి బస్సులు రాక తరగతులకు ఆలస్యంగా రావడం, ఇంటికి వెళ్లే సమయంలో సాయంత్రం వేళల్లో సరిపడా బస్సులు లేక ప్రమాదకరంగా ఫుట్‌బోర్డులపై కూడా ప్రయాణించడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా సమయానికి , విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను నడపాలని విజ్ఞప్తిచేశారు. ఈ విషయం తెలుసుకున్న చేవెళ్ల పోలీసులు అక్కడికి చేరుకొని ఆర్టీసీ అధికారులకు సమాచారం అందజేస్తామని, బస్సులను పెంచే విధంగా కృషిచేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.