నమ్రత ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్న వైద్య సిబ్బంది
- ఆలస్యంగా వెలుగు చూసిన కేసులు
- కలెక్టర్‌కు వార్డు సభ్యురాలి వినతి
- స్పందించిన వైద్య సిబ్బంది
నర్సాపూర్: పట్టణంలో ముగ్గురు చిన్నారులు డెంగీ జ్వరంతో అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డెంగీతో బాధపడుతున్న చిన్నారులకు తల్లిదండ్రులు సకాలంలో చికిత్స చేయంచడంతో కోలుకుంటున్నారు. విషయం తెలిసి 13వ వార్డు సభ్యురాలు కంది బబిత, ఆమె భర్త టీఆర్‌ఎస్ నాయకుడు కంది ప్రభాకర్‌రావు గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు.
పట్టణంలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని వారు కోరారు. దీంతో స్పందించిన కలెక్టర్ ఆరోగ్య కేంద్రం సిబ్బందిని పట్టణంలో పరిశీలించాలని ఆదేశించారు. మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జ్యోతి, ఇతర సిబ్బంది పట్టణంలో పర్యటించి డెంగీ బాధితుల వివరాలు సేకరించారు.
డెంగీ బాధితులు ముగ్గురిదీ ఒకే వార్డు
పట్టణంలోని 13 వార్డుకు చెందిన ముగ్గురు చిన్నారులు డెంగీతో చికిత్స పొందుతున్నారు. పట్టణంలోని విజయ్‌కుమార్ కూతురు బిందుకు గత నెల చివరి వారంలో జ్వరం రావడంతో ఐదు రోజులపాటు ఇక్కడే చికిత్స చేయించినా తగ్గ లేదు. దీంతో గాంధీ ఆసుపత్రికి తీసుకుపోగా ఈ నెల 3న ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి డెంగీ వ్యాధిగా నిర్ధారించారు. వైద్యం చేసి కోలుకున్న అనంతరం ఇంటికి పంపారు.
అదే వార్డుకు చెందిన వెంకటేశం కూతురు నమ్రతకు గత నెల 25న జ్వరం రాగా స్థానికంగా చికిత్స చేయించారు. అనంతరం షాపూర్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించామని బాలిక తండ్రి చెప్పారు. అదే వార్డులోని శ్రీనివాస్ కుమారుడు నితిన్‌కుమార్‌కు సైతం 15 రోజుల క్రితం జ్వరం వచ్చింది. దీంతో హైదరాబాద్‌లో చికిత్స పొంది ఇటీవలే డిశ్చార్జి అయ్యాడు.
పారిశుద్ధ్యం అధ్వానం
తమ వార్డులో పారిశుద్ధ్య పనులు అధ్వానంగా ఉన్నాయని వార్డు సభ్యురాలు కంది బబిత, టీఆర్‌ఎస్ నాయకుడు కంది ప్రభాకర్‌రావులు ఆరోపించారు. మురికి పేరుకుపోవడంతో పందులు ఎక్కువగా సంచరిస్తున్నాయని, దోమలు ఎక్కువయ్యాయని, దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు.