విషాద పరీక్ష అవధి లేని శోకం | students writing exam in sad situation | Sakshi
Sakshi News home page

విషాద పరీక్ష అవధి లేని శోకం

Published Sun, Apr 3 2016 12:56 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM

విషాద పరీక్ష  అవధి లేని శోకం - Sakshi

విషాద పరీక్ష అవధి లేని శోకం

ఇద్దరు విద్యార్థులకు విషాద పరీక్ష
కన్నవారు మృతి చెందడంతో తీరని వేదన
అయినా పరీక్ష రాసిన విద్యార్థులు
దేవరాపల్లి, పెదబయలులో కన్నీటి ఘటనలు

పదో తరగతే పెద్ద  పరీక్షనుకునే ఆ పిల్లలిద్దరికీ  విధి చెప్పనలవి కానంత కఠినమైన పరీక్ష పెట్టింది. రేపేం ప్రశ్నలొస్తాయోనని ఆందోళనతో సతమతమయ్యేంత సున్నిత మనస్కులను భరించలేనంత కర్కశమైన సంఘటనతో అతలాకుతలం చేసింది. అనుకోని ప్రశ్న వస్తేనే బెంబేలెత్తే బేల హృదయాలున్న వారిని ఊహించనలవి కాని పరిణామాలతో విలవిలలాడేలా చేసింది. పరీక్షల వేళ కాస్త అలజడిని కూడా తట్టుకోలేని వయస్సులో ఉన్న ఆ ఇద్దరి కన్నవారిని ఎత్తుకుపోయి క్రూరంగా పరిహసింది. రేపు పరీక్షనగా ఈరోజు జరిగిన ఘోరాలతో ఆ విద్యార్థి, విద్యార్థిని గుండెల్లో కన్నీరు ఉప్పెనలా ఉప్పొంగింది. అయితే అంత దుఖాన్ని పంటి బిగువున అణచిపెట్టి పరీక్ష రాసిన వారిని చూసి చివరికి విధి హృదయం కూడా బరువెక్కే ఉంటుంది.

 దేవరాపల్లి/ పెదబయలు: మరి కొన్ని గంటల్లో పరీక్ష రాయనున్నారనగా ఆ విద్యార్థులిద్దరికీ ఎవరూ ఊహించడానికి కూడా సాహసించని పరీక్ష ఎదురైంది. ఓ విద్యార్థి, ఓ విద్యార్థిని టెన్త్ సాంఘిక శాస్త్రం-1 పరీక్ష రాయబోతున్న తరుణంగా కన్నవారికి కోల్పోయిన విషాదం చోటు చేసుకుంది. దేవరాపల్లి, పెదబయలుల్లో ఇద్దరు టెన్త్ విద్యార్థులు ఒకరు తండ్రిని, మరొకరు తల్లిని కోల్పోయి వేదనతో విలవిలలాడాల్సి వచ్చింది. అయితే తీరని ఆవేదనలోనూ శనివారం సోషల్-1 పరీక్ష రాయడంతో ప్రతి ఒక్కరి హృదయం చెమ్మగిల్లింది.

 దేవరాపల్లి గాంధీవీధికి చెందిన కదిరి ప్రసాద్  తెనుగుపూడి రెసిడెన్షియల్ స్కూల్‌లో టెన్త్ పరీక్షలు రాస్తున్నాడు. అతని తండ్రి అప్పారావు (40) కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతూ శుక్రవారం రాత్రి మరణించాడు. ప్రసాద్ ఏకైక కుమారుడు. అతడే తండ్రికి తలకొరివి పెట్టాలి. విద్యా సంవత్సరం కోల్పోకూడదన్న ఆలోచనతో ప్రసాద్ పరీక్షకు హాజరయ్యాడు. తెనుగుపూడి రెసిడెన్షియల్ స్కూల్‌లో సోషల్ పరీక్ష రాసివచ్చి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. తండ్రికి తలకొరివి పెట్టాడు. ఈ సంఘటన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులను కన్నీటిలో ముంచెత్తింది. దేవరాపల్లిలో విషాదం చోటుచేసుకుంది.

 మండల కేంద్రం పెదబయలు గ్రామానికి చెందిన సల్లంగి శ్రావణి స్థానిక ఎస్టీ ఆన్స్ పాఠశాలలో టెన్త్ చదువుతూ అక్కడి జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం-2లో పరీక్ష రాస్తోంది. శుక్రవారం సాయంత్రం  6 గంటలకు  తల్లి సల్లంగి వరహాలమ్మ(48) ఉన్నపళంగా కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. తండ్రి సల్లంగి జగన్నాథం ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంగా పని చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి తల్లి మృతదేహం వద్ద కూర్చొని రోదించిన శ్రావణి శనివారం విషాదకర పరిస్థితుల్లో పరీక్షకు హాజరయింది. దుఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాసింది. మధ్యాహ్నం  2 గంటలకు తిరిగొచ్చి తల్లి అంత్యక్రియల్లో పాల్గొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement