సుబాబుల్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
విజయవాడ(గాంధీనగర్) : సుబాబుల్, జామాయిల్, సరుగుడు కర్రను ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయాలని, ఎస్‌పీఎం బకాయిలను సెంట్రల్ మానిటరింగ్ ఫండ్ నుంచి రైతులకు చెల్లించాలని సుబాబుల్, జామాయిల్, సరుగుడు రైతు సంఘ సమావేశం తీర్మానించింది. హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో సుబాబుల్, జామాయిల్, సరుగుడు రైతు సంఘం సమావేశం శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ఏఐకెఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య మాట్లాడుతూ కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలన్నారు. ప్రతి కంపెనీ నుంచి కొనుగోలుకు అవసరమైన బ్యాంక్ గ్యారెంటీ తీసుకోవాలన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి వి.హనుమారెడ్డి మాట్లాడుతూ క్వింటా మద్దతు ధర రూ. 4600 ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లాల వారీగా రేటు నిర్ణయించేందుకు వీలు కల్పిస్తూ రూపొందించిన జీవో 143 ఉపసంహరించుకోవాలన్నారు. కొనుగోలు బకాయిలు చెల్లించని ఎస్‌పీఎం యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయశాఖా మంత్రి తక్షణమే జోక్యం చేసుకుని ధర అమలుకు రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని, సమస్యల పరిష్కారానికి చొరవచూపాలని హనుమారెడ్డి కోరారు. సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, ఏ వెంకటాచారి, పి నాగభూషణం, ఎన్.అంజిరెడ్డి పాల్గొన్నారు.