భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్యేశ్వరుడి ఉత్సవం
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాన్ని పురస్కరించుకుని హిందూపురంలోని పళనీనగర్, ఇందిరానగర్ ప్రాంతాల్లో స్థిరపడిన తమిళులు, కేరళీయులు ఆదివారం పెద్ద ఎత్తున భక్తిపారవశ్యంలో మునిగితేలారు. కార్తికేయుడిపై ఉన్న తమ భక్తికి పరాకాష్టగా శరీరాలకు కొక్కెలు తగిలించుకుని విల్లక్కు రథాలకు వేలాడారు. కావడిలు మోస్తూ శరీరానికి శూలాలు, అంబులు గుచ్చుకున్నారు. అంతకు ముందు 21 రోజులుగా సుబ్రహ్మణ్యేశ్వరుడి మాలాధారణతో వ్రతం చేశారు.
మొక్కులో భాగంగా కొందరు తమ చెంపకు శూలాలు గుచ్చుకోగా, మరికొందరు కొక్కెలు తగిలుంచుకుని గంటలు, నిమ్మకాయలను వేలాడదీశారు. మరికొందరు శరీరానికి గుచ్చుకున్న కొక్కెలతో ఆటోలు, రాతి రోళ్లు లాగారు. ఉత్సవ ఊరేగింపు పళనీనగర్ నుంచి బెంగళూరు రోడ్డు, చిన్నమార్కెట్, గాంధీ సర్కిల్, మెయిన్ రోడ్డు మీదుగా పొట్టి శ్రీరాములు సర్కిల్ నుంచి తిరిగి ఆలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన పూజల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి, టీడీపీ నేత అంబికా లక్ష్మినారాయణ, సంఘం నాయకులు వేలు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
- హిందూపురం అర్బన్