అనంతపురం అగ్రికల్చర్: జాతీయ నూనెగింజల పథకం కింద రాయితీతో అందించనున్న నీటి సరఫరా పైపులు (వాటర్ క్యారియింగ్ పైప్స్) అవసరమైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది జిల్లాకు 445 యూనిట్లు మంజూరయ్యాయన్నారు. రెండు, రెండున్నర, మూడు, నాలుగు ఇంచుల పీవీసీ పైపులు ఇస్తామన్నారు. ఐదు ఎకరాల్లోపున్న రైతులకు ఒక్కో యూనిట్ కింద రెండు, రెండున్నర ఇంచుల పైపులు 43, మూడు ఇంచులవి 35, నాలుగు ఇంచులవి 25 పైపులు ఇస్తామన్నారు. అలాగే ఐదు ఎకరాలకు పైబడి ఉన్న రైతులకు రెండు, రెండున్నర ఇంచులవి 66, మూడు, నాలుగు ఇంచులవి 50 పైపులు ఇస్తామన్నారు. రెండు ఇంచుల పైపులకు సంబంధించి పూర్తి ధరపై రూ.155, ఆపైన ఉన్న పైపులపై రూ.210 ప్రకారం రాయితీ వర్తిస్తుందని ఆయన తెలిపారు. అవసరమైన వేరుశనగ రైతులు మండల వ్యవసాయాధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.