సుధా 'మంగళ ప్రదం'
సుధా 'మంగళ ప్రదం'
Published Wed, Dec 14 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM
– శోభాయమానంగా మహోత్సవం
– పీఠాధిపతులు, పండితుల మధ్య సాగిన విద్యార్థుల వ్యాఖ్యార్థం
– ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
మంత్రాలయం : వేద పండిత మహాశయులు ఒకే వేదికపై కొలువుదీరిన వేళ. పుష్కర కాలం వేద అభ్యసనం చేసిన విద్యార్థుల పరీక్ష సమయం. భక్తలోకం కను, వీనుల గావింతు వేదిక. దేశ సంస్కృత విద్యాపీఠాల్లో ఏనాడు కనీవినీ ఎరుగని సుధా మంగళ మహోత్సవం. శ్రీరాఘవేంద్రస్వామి సన్నిదానంలో మంగళప్రదంగా సాగిన వేడుక ఆసాంతం శోభాయమానం. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో పన్నెండేళ్ల విద్వత్ సభ బుధవారం ఆసక్తిదాయకంగా సాగింది. శ్రీమఠం డోలోత్సవ మంటపంలో పుష్పశోభిత అలంకార సభ నిర్వహించారు. ముందుగా సుబుధేంద్రతీర్థులు, పుత్తిగె మఠం పీఠాధిపతి సుగుణేంద్రతీర్థులు శ్రీరాఘవేంద్రస్వామికి విశిష్ట పూజలు నిర్వహించారు. వేదికపై కొలువుదీరిన వేదవ్యాసులు, 25 శ్రీమన్‌న్యాయ సుధా గ్రంథాలు, జయతీర్థులు(టీకాచార్యులు) చిత్రపటాలకు శాస్త్రోక్తంగా పూజా ఘట్టాలు గావించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్య స్వరాలు, భక్తుల హర్షధ్వానులు కురుస్తుండగా సుబుధేంద్రతీర్థులు జ్యోతి ప్రజల్వనతో సుధా మంగళ మహోత్సవానికి అంకురార్పణ పలికారు. పీఠాధిపతులు ఉత్సవ విశిష్టత, వాఖ్యార్థ ఉచ్ఛరణ విధానం ప్రవచించారు.
అణువణువునా వేదం :
తుంగాతీరాన సుధా మంగళం వేడుక అణువణువునా వేదం పలికించింది. పీఠాధిపతులు సుబుధేంద్రతీర్థులు, సుగుణేంద్రతీర్థులు, హణసోగె విశ్వనందన తీర్థులు, బెంగుళూరు విశ్వగురుప్రియ తీర్థులు, పండిత కేసరి గిరియాచార్ సమక్షంలో విద్యార్థులు శ్రీమన్ న్యాయ సుధా గ్రంథ వాఖ్యార్థం కానిచ్చారు. విద్యార్థులు వల్లించిన శ్లోకాలకు పీఠాధిపతులు, విద్వాన్‌లు విచారణ జరిపారు. విద్యార్థులు ఎంతో వినయ విధేయలతో పండితుల ప్రశ్నావళికి అర్థవంత సమాధానాలు చెప్పుకొచ్చారు. మొత్తం 20 మంది విద్యార్థులు 12 ఏళ్లపాటు వేద విద్యను అభ్యసించారు. మూడేళ్లలో పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు, పండిత కేసరి గిరియాచార్‌తో పఠనం చేసిన గ్రంథాలపై వాఖ్యార్థం నిర్వహించారు. మూడు బ్యాచ్‌ల విద్యార్థులూ తమ ప్రతిభతో విద్వాన్‌లను మెప్పించి పీఠాధిపతుల ఆశీస్సులతో అనుగ్రహ ప్రాప్తి పొందారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎంతో పవిత్రంగా సుధా మంగళం మహోత్సవం సాగింది. గురువారం విద్యార్థులకు 'వేదాంత శాస్త్ర విద్వాన్'గా పట్టా, ఒక్కోవిద్యార్థికి రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకాలు అందజేస్తారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు :
వేడుక సందర్భంగా యోగీంద్ర మండపంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పండిత శేషగిరిరావు ఆలపించిన దాసవాణి భజన సంకీర్తనలు భక్తులను అలరించాయి. ఉడిపికి చెందిన భార్గవి నృత్య ప్రదర్శన మైమరిపించింది. గురుసార్వభౌమ దాస సాహిత్య అకాడమీ నేతృత్వంలో 1000 మందితో హరిదాస భజన గేయాలపనలు వీనుల విందు చేశాయి. కార్యక్రమంలో ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, సంస్కృత విద్యాపీఠం ఉప కులపతి పంచముఖి, ప్రధానాచార్యులు వాదిరాజాచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, దాస సాహిత్య అకాడమీ అప్పన్నాచార్యులు, వాదిరాజాచార్, హనుమేశాచార్ పాల్గొన్నారు.
Advertisement