
డబ్బులు కాజేసి సైకిళ్లపై పారిపోతున్న దొంగలు
రాంగోపాల్‌పేట: నగరంలో కాస్త విరామం తర్వాత సూడో పోలీసులు అలజడి చేశారు. సికింద్రాబాద్‌లోని మహంకాళి ఠాణా పరిధిలో బుధవారం ఉదయం పంజా విసిరిరారు. బ్రౌన్‌షుగర్ అక్రమ రవాణా అనుమానమంటూ తనిఖీలు చేసి చెన్నైకి చెందిన వ్యాపారి నుంచి రూ.7.5 లక్షలు తస్కరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే సూడో పోలీసుల ‘డెన్’ ఉందనే అనుమానంతో ఆరా తీస్తున్నారు.
తమిళనాడులోని చెన్నై సమీపంలో ఉన్న సేలంకు చెందిన జ్యువెలరీ వ్యాపారి గోపీనాథ్ అక్కడ వెండి ఆఖరణాలు తయారు చేసుకువచ్చి, నగరంలో వ్యాపారస్తులకు విక్రయిస్తుంటారు. చెన్నై–హైదరాబాద్ మధ్య వెండి ధరలో రూ.మూడునాలుగొందల వ్యత్యాసం ఉంటోంది. దీంతో ఇక్కడే వెండి ఖరీదు చేసుకుని వెళ్లే గోపీనాథ్... ఆభరణాలు, వస్తువులు తయారు చేసి మళ్లీ నగరానికే తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. దీనికోసం వారానికి ఓ రోజు హైదరాబాద్ రావడం పరిపాటి కావడంతో బస చేయడానికి సుభాష్‌రోడ్‌లో ఒక చిన్న గది అద్దెకు తీసుకున్నాడు.
గది సమీపంలోనే ఘటన...
ఎప్పటిలానే సేలం నుంచి ప్రైవేట్ బస్సులో వచ్చిన గోపీనాథ్ బుధవారం ఉదయం 8.30 గంటలకు లక్డీకపూల్‌లో దిగాడు. రెండు బ్యాగులతో వచ్చిన ఆయన అక్కడ నుంచి ఆటోలో సుభాష్‌రోడ్‌కు చేరుకున్నాడు. తాను నివసించే గది సమీపంలోనే బటర్‌ఫ్లై బేకరీ వద్ద ఆటో దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే సైకిళ్లపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గోపీనాథ్‌ను ఆపి తాము పోలీసులమని పరిచయం చేసుకున్నారు. మీ బ్యాగులో మాదకద్రవ్యమైన బ్రౌన్‌షుగర్ ఉన్నట్లు సమాచారం వచ్చిందంటూ బెదిరించారు. తనిఖీలు చేయాలంటూ బ్యాగు తెరిచి చూపించాలని ఆదేశించారు. దీంతో గోపీనాథ్ అలానే చేయగా...
ఒక దాంటో ఉన్న 25 కేజీల వెండి ఆభరణాలు, మరో బ్యాగ్‌లో రూ.20 లక్షల నగదు ఉన్నాయి. ఓపక్క తనిఖీలు చేస్తున్నట్టు నటిస్తున్న ఆ ద్వయం అదును చూసుకుని బాధితుడి దృృష్టి మరల్చింది. బ్యాగ్‌లో ఉన్న రూ.20 లక్షల నుంచి రూ.7.50 లక్షలు తస్కరించింది. ఆపై యథావిధిగా గోపీనా«థ్‌ను పంపేసింది. తన రూమ్‌కు వెళ్ళాక విషయం గుర్తించిన బాధితుడు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ రమేష్ దర్యాప్తు చేపట్టారు.
వివిధ కోణాల్లో దర్యాప్తు...
ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న మహంకాళి పోలీసులు ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలోనే సైకిళ్లపై వస్తున్న ఇద్దరు అనుమానితుల్ని గుర్తించారు. ఆ ఇద్దరిలో ఒకరు 50 ఏళ్లు, మరొకరు 40 ఏళ్ల వయస్కులని పోలీసులు అంచనా వేశారు. వీరు ఎక్కువ దూరం నుంచి సైకిల్ పైన రాలేరని, ఆ సమీపంలోనే వీరి డెన్ ఉంటుందని అనుమానిస్తూ ఆరా తీస్తున్నారు. మరోపక్క ఈ నేరం ఉదయం జరగడం, అప్పుడో గోపీనాథ్‌కు సేలం నుంచి రావడంతో ఆయనకు తెలిసిన వారి ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.