Jeweler merchant
-
తమిళనాడులో పట్టుబడిన డబ్బు మాదే..!
సాక్షి, ఒంగోలు: తమిళనాడులో పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన నగదు ఒంగోలుకు చెందిన ఎన్వీఆర్ జ్యూయలర్స్‌కు చెందిందని ఆ సంస్థ యజమాని నల్లమల్లి బాలు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక గోల్డ్‌మర్చంట్స్ అసోసియేషన్ కల్యాణ మండపంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తాతా ప్రసాద్, కార్యదర్శి పి.రమేష్‌లతో పాటు అసోసియేషన్ సభ్యులు, ఎన్వీఆర్ జ్యుయలర్స్ అధినేత నల్లమల్లి బాలు పోలీసులకు పట్టుబడిన నగదు విషయమై వివరించారు. ఈ సందర్భంగా నల్లమల్లి బాలు మాట్లాడుతూ శ్రావణ మాసం వస్తున్న సందర్భంగా హోల్‌సేల్ వ్యాపారం చేస్తున్న తాము బంగారం కొనుగోలు చేయడానికి తమిళనాడుకు తమ గుమస్తాలను నగదుతో పంపించామన్నారు. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న సందర్భంగా రూ. 5,22,50,000 కారులో పంపామన్నారు. అయితే పోలీసుల తనిఖీల సందర్భంగా పట్టుబడటంతో ఆ నగదును తమిళనాడుకు చెందిన ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు అప్పగించారని ఆయన వెల్లడించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ నాయకులు ఆదాయపన్ను శాఖ అధికారులు రెండు రోజుల క్రితం ఒంగోలుకు వచ్చి మా షాపు, ఇళ్లు తనిఖీలు చేశారని వివరించారు. ఈ సందర్భంగా తమిళనాడులో పట్టుబడిన నగదుకు సంబంధించి నోటీసు కూడా ఇచ్చారన్నారు. ఆ డబ్బుకు లెక్కను చూపించమని కోరారని వెల్లడించారు. అయితే నగదు పట్టుబడినప్పటి నుంచి రాజకీయ నాయకులకు, పార్టీలకు సంబంధించిందని మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఈ నగదుతో ఏ రాజకీయ నాయకుడికీ సంబంధం లేదన్నారు. గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తాతా ప్రసాద్ మాట్లాడుతూ బంగారు వ్యాపారి నల్లమల్లి బాలుకు చెందిన నగదు పట్టుబడటంతో ఆ నగదు రాజకీయ నాయకులదేనని కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని వివరించారు. ఆదాయ పన్నుతో పాటు ప్రభుత్వాలకు చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులు ఎన్వీఆర్ జ్యుయలర్స్ యజమానులు చెల్లిస్తున్నారని తెలిపారు. రాజకీయ ప్రకంపనలు చేయడమే కొంతమంది పనిగా పెట్టుకున్నారని అవి ఏ రాజకీయ పారీ్టకి చెందిన నాయకుడి నగదు కాదన్నారు. కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ వ్యవహారం గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నకు కాలం చెల్లిన స్టిక్కర్‌ను తమ డ్రైవర్ విజయ్ కారుకు అంటించుకున్నాడన్నారు. అది గిద్దలూరు ఎమ్మెల్యేకు చెందినదని తరువాత మాకు తెలిసిందని ఆయన వివరించారు. సమావేశంలో సూపర్ బజార్ చైర్మన్, బంగారు వ్యాపారి వేమూరి సూర్యనారాయణ (బుజ్జి), అసోసియేషన్ సభ్యులు దాసరి నారాయణరావు, నల్లమల్లి కుమార్‌లతో పలువురు పాల్గొన్నారు. -
రూ.3 కోట్ల విలువైన బంగారు నగల అపహరణ
బంగారుపాళెం: చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలంలో శనివారం నగల వ్యాపారుల నుంచి సుమారు మూడు కోట్ల విలువైన 9 కేజీల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. దీనిపై బాధితులు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలమనేరు డీఎస్పీ రామ్‌కుమార్ కథనం మేరకు.. బెంగళూరుకు చెందిన బంగారు వ్యాపారులు సంజయ్, కేదార్ వైజాగ్ నుంచి శుక్రవారం రాత్రి 14 కేజీల బంగారు ఆభరణాలు తీసుకుని మార్నింగ్ స్టార్ బస్‌లో బెంగళూరు బయల్దేరారు. ఒక బ్యాగ్‌లో 9 కేజీలు, మరో బ్యాగ్‌లో 5 కేజీల బంగారు నగలు ఉంచారు. శనివారం ఉదయం బంగారుపాళెం సమీపంలోని నందిని ఫుడ్ ప్లాజా వద్ద టిఫిన్ కోసమని బస్సు ఆపారు. బెంగళూరుకు వెళ్లి బ్యాగ్‌లను చూసుకుంటే 9 కేజీల బంగారు నగల బ్యాగ్ కనిపించలేదు. దీంతో బాధితులు శనివారం బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. వాటి విలువ రూ.3 కోట్లని పేర్కొన్నారు. సంఘటన జరిగిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో ఉండటంతో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పడంతో వారు ఆదివారం రాత్రి బంగారుపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలమనేరు డీఎస్పీ రామ్‌కుమార్, గంగవరం సీఐ శ్రీనివాసులు బంగారుపాళెంకు చేరుకుని బాధితులను విచారించారు. ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
రాఖీలపై మోదీ, ఆదిత్యనాథ్‌ల ఫోటోలు
గాంధీనగర్: సోదర ప్రేమకు ప్రతీక రక్షాబంధన్. ఆదివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇప్పటికే షాపింగ్ సెంటర్లు, బంగారు దుకాణాలు, స్వీట్‌హౌస్‌లకు పండుగ కల వచ్చేసింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ఆఫర్లు, వివిధ వెరైటీలతో వ్యాపరస్తులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బంగారు పూత మిఠాయిలు, సిల్వర్ స్వీట్స్ వంటి వెరైటీలు మార్కెట్లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సూరత్‌లోని బంగారు దుకాణం యజయాని ఇలాంటి విభన్న ప్రయత్నమే చేశాడు. ప్రధాని నరేంద్రమోదీ, యూపీ యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ సీఎం విజయ్ రూపానీల చిత్రాలతో కూడిన బంగారు రాఖీలను తయారు చేయించాడు. ఇప్పడు గుజరాత్లో వీటికి యమా క్రేజ్ వచ్చేసింది. తమ అభిమాన నాయకుల ఫోటోలతో కూడిన రాఖీలకోసం ఆర్డర్ ఇచ్చి మరీ తయారు చేయించుకుంటున్నారని షాప్ యజమాని పేర్కొంటున్నారు. ‘ ప్రధాని నరేంద్ర మోదీలాగా నా తమ్ముడు కూడా గొప్పవాడు కావాలనే ఉద్దేశంతో ఆయన చిత్రం ఉన్న రాఖీ కావాలని ఆర్డర్ చేశానని’ ఓ సోదరి వివరించింది. -
అసలెవరీ నీరవ్ మోదీ?
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణం చోటుచేసుకున్నట్టు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని బ్యాంకే బుధవారం తేల్చింది. దాదాపు రూ.11,346 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు బుధవారం బీఎస్ఈ ఫైలింగ్‌లో బ్యాంకు పేర్కొంది. అయితే ఈ భారీ కుంభకోణానికి, ప్రముఖ వజ్రాల వ్యాపారి, బిలీనియర్ నీరవ్ మోదీకి లింక్‌లున్నట్టు కూడా ఆరోపించింది. అయితే 10 రోజుల ముందు వరకు నీరవ్ మోదీ అంతపెద్ద సెలబ్రిటీ ఏమీ కాదు. ఎప్పుడైతే సీబీఐ వద్ద పంజాబ్ నేషనల్ బ్యాంకు తన ఫిర్యాదును దాఖలు చేసిందో ఇక అప్పటి నుంచి ఆయన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. నీరవ్ మోదీ ఒక పవర్ ఫుల్ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు, వజ్రాల కొనుగోలుదారి. బ్యాంకుకు దాదాపు రూ.280 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలతో నీరవ్ మోదీపై ఫిబ్రవరి 5న సీబీఐ కేసు బుక్ చేసింది. తర్వాతి వారంలోనే బ్యాంకులోని ముంబై బ్రాంచులో భారీ మొత్తంలో కుంభకోణం చోటు చేసుకుందని, దాదాపు రూ.11,346 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు జరిగాయంటూ ఫిర్యాదు చేసింది. ఈ కుంభకోణంతో లింక్‌ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ, భారత్‌లో అత్యంత చిన్న వయసులోనే బిలీనియర్‌గా ఫోర్బ్స్ లిస్టులో చోటు దక్కించుకున్న వ్యక్తి.. 2.3 బిలియన్ డాలర్ల ఫైర్ స్టార్ డైమండ్ వ్యవస్థాపకుడు. వజ్రాల వ్యాపారుల కుటుంబంలోనే పుట్టిన నీరవ్ మోదీ, వజ్రాల వృత్తినే తన వ్యాపారంగా ఎంచుకున్నారు. ఆసియాలోని చైనా నుంచి నార్త్ అమెరికాలోని హవాయి దీవుల వరకు మూడు ఖండాలలో ఆయన తన వ్యాపారాలను విస్తరించారు. 2013లో ఫోర్బ్స్ బిలీనియర్స్ జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. 2016 ఫోర్బ్స్ బిలీనియర్స్ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా నీరవ్‌మోదీకి 1,067 ర్యాంకు ఉండగా... భారత్‌లో ఆయన 46వ బిలీనియర్‌గా నిలిచారు. గతేడాది భారత్ నుంచి ఫోర్బ్స్ జాబితాలో 82వ ర్యాంకును పొందారు. 2014లో ఢిల్లీలో తన తొలి ఫ్లాగ్షిప్ స్టోర్‌ను లాంచ్ చేశారు. అనంతరం 2016లో న్యూయార్క్‌లో కూడా ఒక స్టోర్‌ను ఏర్పాటుచేశారు. ఇలా తన వ్యాపారాలను, స్టోర్లను గ్లోబల్‌గా విస్తరించుకుంటూ వెళ్లారు. ఆయన జువెల్లరీ డిజైన్లకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫ్యాషన్‌కు ఐకాన్‌గా నీరవ్ మోదీ జువెల్లరీస్‌ను చెప్పుకోవచ్చు. లగ్జరీ డైమాండ్ జువెల్లరీ డిజైనర్‌గా ఆయనకు పేరుంది. కేవలం వజ్రాలను జువెల్లరీగా ప్రమోట్ చేయడమే కాకుండా.. పెట్టుబడులుగా కూడా ప్రమోట్ చేస్తున్నారు. అయితే పీఎన్బీ నమోదుచేసిన చీటింగ్ కేసులో భాగంగా ఐటీ అధికారులు నీరవ్ మోదీ ఆఫీసులు ఢిల్లీ, సూరత్, జైపూర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటికే పలు రైడ్స్ కూడా జరిగాయి. నీరవ్‌మోదీతో పాటు మరో నాలుగు బడా జ్యుయలరీ సంస్థలపైనా దర్యాప్తు సంస్థలు విచారణను సీబీఐ ముమ్మరం చేసింది. ఈ విచారణలో పీఎన్‌బీఐ స్కాంలో నీరవ్ మోదీ, బడా జ్యుయలరీ సంస్థల పాత్ర ఏ మేర ఉందో బయటపడబోతుంది. -
స్వామిరారా.. సినిమాను మరిపించే దొంగలు
-
స్వామిరారా.. సినిమాను మరిపించే దొంగలు
రాంగోపాల్‌పేట: నగరంలో కాస్త విరామం తర్వాత సూడో పోలీసులు అలజడి చేశారు. సికింద్రాబాద్‌లోని మహంకాళి ఠాణా పరిధిలో బుధవారం ఉదయం పంజా విసిరిరారు. బ్రౌన్‌షుగర్ అక్రమ రవాణా అనుమానమంటూ తనిఖీలు చేసి చెన్నైకి చెందిన వ్యాపారి నుంచి రూ.7.5 లక్షలు తస్కరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే సూడో పోలీసుల ‘డెన్’ ఉందనే అనుమానంతో ఆరా తీస్తున్నారు. తమిళనాడులోని చెన్నై సమీపంలో ఉన్న సేలంకు చెందిన జ్యువెలరీ వ్యాపారి గోపీనాథ్ అక్కడ వెండి ఆఖరణాలు తయారు చేసుకువచ్చి, నగరంలో వ్యాపారస్తులకు విక్రయిస్తుంటారు. చెన్నై–హైదరాబాద్ మధ్య వెండి ధరలో రూ.మూడునాలుగొందల వ్యత్యాసం ఉంటోంది. దీంతో ఇక్కడే వెండి ఖరీదు చేసుకుని వెళ్లే గోపీనాథ్... ఆభరణాలు, వస్తువులు తయారు చేసి మళ్లీ నగరానికే తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. దీనికోసం వారానికి ఓ రోజు హైదరాబాద్ రావడం పరిపాటి కావడంతో బస చేయడానికి సుభాష్‌రోడ్‌లో ఒక చిన్న గది అద్దెకు తీసుకున్నాడు. గది సమీపంలోనే ఘటన... ఎప్పటిలానే సేలం నుంచి ప్రైవేట్ బస్సులో వచ్చిన గోపీనాథ్ బుధవారం ఉదయం 8.30 గంటలకు లక్డీకపూల్లో దిగాడు. రెండు బ్యాగులతో వచ్చిన ఆయన అక్కడ నుంచి ఆటోలో సుభాష్‌రోడ్‌కు చేరుకున్నాడు. తాను నివసించే గది సమీపంలోనే బటర్‌ఫ్లై బేకరీ వద్ద ఆటో దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే సైకిళ్లపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గోపీనాథ్‌ను ఆపి తాము పోలీసులమని పరిచయం చేసుకున్నారు. మీ బ్యాగులో మాదకద్రవ్యమైన బ్రౌన్‌షుగర్ ఉన్నట్లు సమాచారం వచ్చిందంటూ బెదిరించారు. తనిఖీలు చేయాలంటూ బ్యాగు తెరిచి చూపించాలని ఆదేశించారు. దీంతో గోపీనాథ్ అలానే చేయగా... ఒక దాంటో ఉన్న 25 కేజీల వెండి ఆభరణాలు, మరో బ్యాగ్‌లో రూ.20 లక్షల నగదు ఉన్నాయి. ఓపక్క తనిఖీలు చేస్తున్నట్టు నటిస్తున్న ఆ ద్వయం అదును చూసుకుని బాధితుడి దృృష్టి మరల్చింది. బ్యాగ్‌లో ఉన్న రూ.20 లక్షల నుంచి రూ.7.50 లక్షలు తస్కరించింది. ఆపై యథావిధిగా గోపీనా«థ్‌ను పంపేసింది. తన రూమ్‌కు వెళ్ళాక విషయం గుర్తించిన బాధితుడు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ రమేష్ దర్యాప్తు చేపట్టారు. వివిధ కోణాల్లో దర్యాప్తు... ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న మహంకాళి పోలీసులు ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలోనే సైకిళ్లపై వస్తున్న ఇద్దరు అనుమానితుల్ని గుర్తించారు. ఆ ఇద్దరిలో ఒకరు 50 ఏళ్లు, మరొకరు 40 ఏళ్ల వయస్కులని పోలీసులు అంచనా వేశారు. వీరు ఎక్కువ దూరం నుంచి సైకిల్ పైన రాలేరని, ఆ సమీపంలోనే వీరి డెన్ ఉంటుందని అనుమానిస్తూ ఆరా తీస్తున్నారు. మరోపక్క ఈ నేరం ఉదయం జరగడం, అప్పుడో గోపీనాథ్‌కు సేలం నుంచి రావడంతో ఆయనకు తెలిసిన వారి ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.