
బంగారుపాళెం: చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలంలో శనివారం నగల వ్యాపారుల నుంచి సుమారు మూడు కోట్ల విలువైన 9 కేజీల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. దీనిపై బాధితులు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలమనేరు డీఎస్పీ రామ్‌కుమార్ కథనం మేరకు.. బెంగళూరుకు చెందిన బంగారు వ్యాపారులు సంజయ్, కేదార్ వైజాగ్ నుంచి శుక్రవారం రాత్రి 14 కేజీల బంగారు ఆభరణాలు తీసుకుని మార్నింగ్ స్టార్ బస్‌లో బెంగళూరు బయల్దేరారు. ఒక బ్యాగ్‌లో 9 కేజీలు, మరో బ్యాగ్‌లో 5 కేజీల బంగారు నగలు ఉంచారు. శనివారం ఉదయం బంగారుపాళెం సమీపంలోని నందిని ఫుడ్ ప్లాజా వద్ద టిఫిన్ కోసమని బస్సు ఆపారు.
బెంగళూరుకు వెళ్లి బ్యాగ్‌లను చూసుకుంటే 9 కేజీల బంగారు నగల బ్యాగ్ కనిపించలేదు. దీంతో బాధితులు శనివారం బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. వాటి విలువ రూ.3 కోట్లని పేర్కొన్నారు. సంఘటన జరిగిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో ఉండటంతో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పడంతో వారు ఆదివారం రాత్రి బంగారుపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలమనేరు డీఎస్పీ రామ్‌కుమార్, గంగవరం సీఐ శ్రీనివాసులు బంగారుపాళెంకు చేరుకుని బాధితులను విచారించారు. ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment