Gold jewelery theft
-
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కేంద్రంలోని బంగారు ఆభరణాల షాపులో చోరీ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 6.181 కిలోల బంగారు ఆభరణాలు, 90.52 గ్రాముల వెండి బ్రాస్లెట్లు, రూ.15 వేల నగదు ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ దీపిక శనివారం విలేక రుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చోరీ నిందితుడు లోకేష్ శ్రీవాస్‌ది ఛత్తీస్‌గఢ్. ఓ కేసులో విశాఖ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు. విజయనగరం జిల్లా కేంద్రంగా జనవరి 16న తొలిసారిగా పద్మజ ఆస్పత్రిలో చోరీ చేశాడు. మళ్లీ ఈ నెల 14న సీఎంఆర్‌లో చోరీకి పాల్పడ్డాడు. వారం వ్యవధిలో ఈ నెల 21న పట్టణంలో రెక్కీ నిర్వహించి రవి జ్యుయలరీ, పాండు జ్యుయలరీ షాపుల్లో దొంగతనానికి దిగాడు. రవి జ్యుయలర్స్‌లో ఉన్న 8 కిలోల బంగారు ఆభరణాలు దొంగిలించి పరారయ్యాడు. నాలుగు పోలీస్ బృందాలు గాలించి నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో అదుపులోకి తీసుకున్నాయి. -
జోస్ అలుకాస్‌లో 30 కిలోల బంగారం, వజ్రాల నగలు చోరీ!
తిరువొత్తియూరు: వేలూరులో ప్రముఖ నగల దుకాణం గోడకు కన్నం వేసి రూ. కోట్లు విలువ చేసే బంగారం, వజ్రాల నగలను చోరీ చేసిన దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. వేలూరు జిల్లా వేలూరు తోటపాలెం ప్రాంతంలో జోస్ అలుకాస్ నగల దుకాణం నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి వ్యాపారం పూర్తయిన తరువాత ఉద్యోగులు దుకాణానికి తాళం వేసి వెళ్లారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఉద్యోగులు దుకాణం తెరిచి లోపలకు వెళ్లగా.. ఆ సమయంలో రాక్లలోని నగలు అన్ని అదృశ్యమైనట్లు గుర్తించా రు. వేలూరు నార్త్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జాగిలాలతో తనిఖీ చేపట్టి, సీసీ టీవీ ఫుటేజీని సేకరించారు. చదవండి: ట్రావెల్ బస్సు చోరీకి యత్నం.. ఇలా దొరికిపోయాడు! -
పనివాడే నిందితుడు
గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): విజయవాడ గవర్నర్‌పేట జైహింద్ కాంప్లెక్స్‌లోని రాహుల్ జ్యూయలరీ దుకాణంలో బంగారు ఆభరణాలు దొంగిలించిన వ్యక్తిని విజయవాడ పోలీసులు 48 గంటల్లోనే పట్టుకున్నారు. అతని వద్ద సుమారు రూ.5 కోట్ల విలువ చేసే 10 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొబ్బిలి వెంకట హర్ష విజయవాడ జైహింద్ కాంప్లెక్స్‌లోని మహావీర్ జైన్‌కు చెందిన రాహుల్ జ్యూయలరీ దుకాణంలో గత సంవత్సరం పనిలో చేరాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో యజమాని మహావీర్ ఆస్పత్రి పనిమీద వెళ్లారు. ఇదే అదనుగా భావించిన హర్ష 5వ అంతస్తులోని యజమాని ప్లాటుకు వెళ్లి షాపులోకి బంగారు ఆభరణాలు కావాలని తీసుకొచ్చాడు. రెండు బ్యాగులలో సుమారు 10 కేజీల బంగారు ఆభరణాలు, షాపులో ఉన్న ఐడీబీఐ బ్యాంకుకు చెందిన యజమాని ఖాళీ చెక్‌తో హర్ష ఉడాయించాడు. 28వ తేదీన తాను దొంగిలించిన బ్యాంకు చెక్‌పై యజమాని సంతకం ఫోర్జరీ చేసి తన అకౌంట్లోకి రూ. 4.60లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేసి.. మధ్యాహ్నం పోరంకిలోని ఐసీఐసీఐ బ్యాంకులో డబ్బులు డ్రా చేశాడు. బంగారు ఆభరణాలు, డబ్బుతో పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అతనిని శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. -
‘ముత్తూట్’ దొంగలు దొరికారు
సాక్షి, హైదరాబాద్: తమిళనాడులో శుక్రవారం సినీఫక్కీలో భారీ దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తెలంగాణ పోలీసులు 24 గంటల వ్యవధిలోనే చాకచక్యంగా పట్టుకున్నారు. కృష్ణగిరి జిల్లా హోసూర్‌లో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలోకి చొరబడి సిబ్బందిని తుపాకులతో బెదిరించి సుమారు రూ. 7.5 కోట్ల విలువజేసే 25 కిలోల బంగారు ఆభరణాలు, రూ. 93 వేల నగదు కొట్టేసిన దోపిడీ దొంగలు తెలంగాణ రాష్ట్రం మీదుగా మహారాష్ట్ర పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 25 కిలోల బంగారు ఆభరణాలు, ఏడు తుపాకులు, 13 సెల్ ఫోన్లు, రూ. 93 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరానికి ఉపయోగించిన వాహనాలను సీజ్ చేశారు. తమిళనాడు పోలీసులు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కేసు వివరాలను కృష్ణగిరి ఎస్పీతో కలసి గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో సీపీ సజ్జనార్ శనివారం మీడియాకు తెలిపారు. లూ«థియానాలో విఫలయత్నం... హోసూర్‌లో సక్సెస్ మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమిత్, శంకర్‌సింగ్ బయ్యాల్ బాగల్, రూప్సింగ్ బాగల్, సుజీత్‌సింగ్, సౌరభ్, రోషన్‌సింగ్‌లు సులువుగా డబ్బు సంపాదించేందుకు నేరాలబాట పట్టారు. గతేడాది అక్టోబర్‌లో పంజాబ్‌లోని లూథియానాలో ఉన్న ఓ ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో వారు దోపిడీకి యత్నించగా సుజీత్‌సింగ్, సౌరభ్, రోషన్‌సింగ్‌ను అక్కడి ప్రజలు పట్టుకున్నారు. కానీ అమిత్, శంకర్‌సింగ్ మాత్రం కాల్పులు జరుపుతూ తప్పించుకొని పరారయ్యారు. ఈసారి ఎలాగైనా దోపిడీని విజయవంతం చేయాలని అమిత్, శంకర్‌సింగ్‌లు రూప్‌సింగ్‌కు చెప్పారు. దీంతో రూప్సింగ్, అమిత్‌లు నవంబర్‌లో బెంగళూరు వెళ్లి అక్కడ ఓ గదిలో అద్దెకు దిగారు. దోపిడీ పథకాన్ని తనకు పరిచయమున్న ఆయుధాలు సరఫరా చేసే నాగపూర్‌కు చెందిన లూల్య పాండేకు రూప్సింగ్ వివరించాడు. జార్ఖండ్‌లో పనిచేసే సమయంలో అమిత్‌కు స్నేహితులైన వివేక్ మండల్, భూపేందర్ మాంజిలతో ఏర్పడిన పరిచయంతో వారికి కూడా వివరించాడు. చాలా వరకు ముత్తూట్ కార్యాలయాల్లోనే రూప్సింగ్ రెక్కీలు చేశాడు. కంటైనర్ లోపల పరిశీలిస్తున్న సజ్జనార్ -
అచ్చం అలాగే..
ఆదోని టౌన్: కర్నూలు మండలం గార్గేయపురంలో జనవరి 4వ తేదీ రాత్రి దొంగలు ఒకే ప్రాంతంలోని ఆరు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. అన్నీ తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేశారు. తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి ప్రవేశించి.. రూ.3.55 లక్షల నగదు, 10 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. తాజాగా ఆదోని పట్టణంలోనూ అచ్చం అలాగే చోరీలకు పాల్పడ్డారు. శనివారం రాత్రి ఆరు ఇళ్ల తాళాలు పగులగొట్టి.. రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. రెండు చోట్లా శనివారం రాత్రే చోరీలు జరగడం, అది కూడా వరుస ఇళ్లలో ఒకే తరహాలో చోరీలకు పాల్పడడం యాదృచ్ఛికమా లేక ఒకే ముఠా పనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదోని పట్టణంలోని పంజ్రాపోల్ వీధిలో శనివారం రాత్రి ఒకే ప్రాంతంలోని ఆరు ఇళ్లలో చోరీ జరిగింది. మెడికల్ రెప్రజెంటేటివ్‌లుగా పనిచేస్తున్న మంజునాథ్, సంపత్‌కుమార్, శివకుమార్ పక్కపక్క ఇళ్లలో ఉంటున్నారు. శనివారం రాత్రి ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. అదే వరుసలోని వేర్వేరు ఇళ్లలో ఉంటున్న దినసరి కూలీలు వీరేష్, రాఘవేంద్ర కూడా బంధువుల ఊళ్లకు వెళ్లారు. దొంగలు ఈ ఐదు ఇళ్ల తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. వస్తువులన్నీ చెల్లాచెదురు చేశారు. పెద్దగా ఏమీ దొరకలేదు. చిన్నచిన్న వస్తువులను ఎత్తుకెళ్లారు. తర్వాత పక్క సందులోని రేష్మా, వినోద్ దంపతుల ఇంట్లో చోరీకి తెగబడ్డారు. రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించే రేష్మా, వినోద్ శనివారం అనంతపురం జిల్లా గుత్తిలో ప్రార్థనలకు వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా చోరీ విషయం వెలుగు చూసింది. తాళం తెగ్గొట్టి, బీరువాను పెకలించి నగదు, ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్ ఎస్ఐ రమేష్ బాబు తన సిబ్బందితో కలిసి చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. చుట్టుపక్కల వారిని విచారించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
పెళ్లి కుమార్తె ఇంట్లో బంగారం చోరీ
చెన్నై, వేలూరు: వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే పెళ్లి కుమార్తె ఇంట్లో నగలు, బంగారం చోరీ జరిగిన ఘటన వాలాజలో సంచలనం రేపింది. వివరాలు.. వేలూరు జిల్లా వాలాజలోని గ్రామమణి వీధికి చెందిన షణ్ముగం బీడీ మండీ యజమాని. ఇతని పెద్ద కుమార్తె పవిత్రకు ఆరణిలో ఆదివారం ఉదయం వివాహం జరిగింది. ఇందుకోసం పెళ్లి కుమార్తెతో పాటు తల్లిదండ్రులు, బంధువులు ఇంటికి తాళం వేసుకుని శనివారం సాయంత్రం ఆరణికి వెళ్లారు. వివాహం ఆదివారం ఉదయం ముగియడంతో పెళ్లి కుమార్తె, బంధువులతో కలిసి షణ్ముగం ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వాలాజలోని ఇంటికి వచ్చారు. ఇంటిలో మిరప పొడి చల్లి ఉండటాన్ని గమనించి లోనికి వెళ్లి చూశారు. వెనుక తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించారు. ఇంటిలోని వస్తువులు చెల్లా చెదరుగా పడి ఉండడంతో బీరువాను పరిశీలించారు. అందులో ఉంచిన 30 సవరాల బంగారం, రూ. 1.50 లక్షల నగదు చోరీ జరిగినట్లు తెలిసింది. ఈ విషయంపై వాలాజ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. -
వృద్ధురాలి కళ్లలో కారం చల్లి..
నెల్లూరు, నాయుడుపేటటౌన్: ఓ యువకుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి కళ్లలో కారం చల్లి ఆమె ఒంటిపై ఉన్న సుమారు పది సవర్ల బంగారు నగలు అపహరించి పరరాయ్యాడు. ఈ సంఘటన నాయుడుపేటలో మంళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఎల్ఐసీ కార్యాలయం ఎదురుగా మిద్దెపై విశ్రాంతి ఉపాధ్యాయురాలు చతురవేదుల విశాలక్ష్మమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ విషయాన్ని పసిగట్టిన గుర్తుతెలియని యువకుడు మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమె ఇంట్లోకి చొరబడి కళ్లలో కారం చల్లాడు. వెంటనే ఆమె మెడలో ఉన్న మూడు బంగారు చైన్లను లాక్కొని పరారయ్యాడు. వృద్ధురాలు పెద్దఎత్తున కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి చేరుకునేసరికి దుండగుడు రైల్వే స్టేషన్ రహదారి వైపు ఉడాయించాడు. సమాచారం అందుకున్న ఎస్సై డి.వెంకటేశ్వరరావు వృద్ధురాలి ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడాడు. నిందితుడి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. రహదారిపై ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా పరారైన నిందితుడిని పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. ఘటన జరిగిన తర్వాత పోలీసు సిబ్బంది, స్థానిక యువకులు పెద్దఎత్తున నిందితుడి కోసం జల్లెడ పట్టారు. ఓ మద్యం షాపు వద్ద నిందితుడు ఉండగా పట్టుకున్నారు. అతనితోపాటు మరో వ్యక్తి ఈ చోరీలో పాలుపంచుకున్నట్లుగా సమాచారం. -
వడ్డీలేని రుణాల పేరిట బురిడీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘నేను దయార్ద్రహృదయుడిని, రుణాలపై వడ్డీ తీసుకోకూడదని నేను నమ్మిన దైవం చెప్పింది. అందుకే బంగారు నగలపై వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నాను’అంటూ ప్రజల్ని నమ్మించిన ఓ వ్యక్తి కుదువబెట్టిన సుమారు రూ. 300 కోట్ల విలువైన బంగారు నగలతో ఉడాయించాడు. చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయం, మద్రాసు హైకోర్టు వద్ద బాధితులు బారులుతీరడంతో ఈ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు .. చెన్నై టీనగర్ వెస్ట్ మాంబళంలో రూబీ బ్యాంకర్స్ అనే పేరుతో బంగారునగల దుకాణం ఉంది. ఈ దుకాణాన్ని రెహమాన్, అతని కుమారులు అనీస్, సయ్యద్ 15 ఏళ్లకు పైగా నడుపుతున్నారు. బంగారు నగలను కుదువ పెట్టేవారికి వడ్డీలేని రుణాలు ఇస్తామని, రుణం చెల్లించగానే కుదువపెట్టిన నగలను తిరిగి ఇచ్చేలా స్కీము నిర్వహించారు. రుణాలపై వడ్డీ తీసుకోరాదని పవిత్ర ఖురాన్లో పొందుపరిచిన మాటల ప్రకారం ఈ సేవలు చేస్తున్నట్లు ఖాతాదారులను నమ్మించాడు. బంగారం విలువలో మూడోవంతు మొత్తాన్ని 3 నెలలు, 6 నెలలు, ఏడాది కాలంలో చెల్లించేలా రుణాలు ఇచ్చారు. వడ్డీ లేని రుణాలపై ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాల్లో కరపత్రాలతో ప్రచారం కూడా చేశారు. ఈ ప్రచారాన్ని నమ్మిన ముస్లింలు సుమారు వెయ్యి కిలోల బంగారు నగలను తాకట్టు పెట్టి రుణాలు పొందారు. ఈ నగలను రూబీ బ్యాంకర్స్ యజమానులు ప్రయివేటు ఫైనాన్స్ కంపెనీల్లో అనేక కోట్ల రూపాయలకు తాకట్టుపెట్టినట్లు, ఆ డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు సమాచారం. పొందిన రుణాలను తిరిగి చెల్లించి నగలు తీసుకోవాలనుకునే వారికి జాప్యం చేయసాగారు. బాధితుడు ఒకరు మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేయడంతో రూబీ బ్యాంకర్స్‌కు కోర్టు సీలువేసింది. ఇదే సమయంలో తన వ్యాపారం దివాలా తీసినట్లుగా యజమాని పేరున పసుపుపచ్చని నోటీసు మూసిఉన్న షోరూంపై అతికించి ఉండటంతో అది చూసిన ఖాతాదారులు కంగుతిన్నారు. ఈనెల 2న నగలు కచ్చితంగా వెనక్కి ఇస్తామని నమ్మబలికిన యజమానులు రూబీ బ్యాంకర్స్‌ను మూసివేసి రాత్రికి రాత్రే పారిపోయినట్లు సమాచారం. దీంతో బాధితులంతా మూకుమ్మడిగా తరలివెళ్లి పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదులు చేశారు. సుమారు వందకు పైగా ఫిర్యాదులు అందడంతో కేసును ఆర్థికనేరాల విభాగానికి అప్పగించారు. అలాగే తొలుత పిటిషన్ వేసిన బాధితునితో కలిసి వందల సంఖ్యలో బాధితులు సోమవారం మద్రాసు హైకోర్టుకు వెళ్లి న్యాయం చేయాల్సిందిగా మొరపెట్టుకున్నారు. ఇప్పటివరకు అందిన ఫిర్యాదుల మేరకు సుమారు రూ.300 కోట్ల విలువైన వెయ్యి కిలోల కుదువనగలతో యజమానులు పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. -
రూ.3 కోట్ల విలువైన బంగారు నగల అపహరణ
బంగారుపాళెం: చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలంలో శనివారం నగల వ్యాపారుల నుంచి సుమారు మూడు కోట్ల విలువైన 9 కేజీల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. దీనిపై బాధితులు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలమనేరు డీఎస్పీ రామ్‌కుమార్ కథనం మేరకు.. బెంగళూరుకు చెందిన బంగారు వ్యాపారులు సంజయ్, కేదార్ వైజాగ్ నుంచి శుక్రవారం రాత్రి 14 కేజీల బంగారు ఆభరణాలు తీసుకుని మార్నింగ్ స్టార్ బస్‌లో బెంగళూరు బయల్దేరారు. ఒక బ్యాగ్‌లో 9 కేజీలు, మరో బ్యాగ్‌లో 5 కేజీల బంగారు నగలు ఉంచారు. శనివారం ఉదయం బంగారుపాళెం సమీపంలోని నందిని ఫుడ్ ప్లాజా వద్ద టిఫిన్ కోసమని బస్సు ఆపారు. బెంగళూరుకు వెళ్లి బ్యాగ్‌లను చూసుకుంటే 9 కేజీల బంగారు నగల బ్యాగ్ కనిపించలేదు. దీంతో బాధితులు శనివారం బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. వాటి విలువ రూ.3 కోట్లని పేర్కొన్నారు. సంఘటన జరిగిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో ఉండటంతో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పడంతో వారు ఆదివారం రాత్రి బంగారుపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలమనేరు డీఎస్పీ రామ్‌కుమార్, గంగవరం సీఐ శ్రీనివాసులు బంగారుపాళెంకు చేరుకుని బాధితులను విచారించారు. ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
బంగారు ఆభరణాల అపహరణ
రాంచంద్రాపురం కాలనీలో ఘటన మహబూబాబాద్ : పట్టణంలోని రామచంద్రాపురం కాలనీలోని ఓ ఇంట్లో దొంగలు బుధవారం చోరీకి పాల్పడినట్లు టౌన్ సీఐ నందిరామ్ నాయక్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. కాలనిలోని ఎన్టీఆర్ స్టేడియం వెనుక భాగంలో బానోత్ భీముడు తన కుటుం బంతో నివాసం ఉంటున్నాడు. భీముడు కురవి మండలంలోని ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతని భార్య కూడా కాంట్రాక్ట్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఇద్దరూ ఇంటికి తాళం వేసి పాఠశాలకు వెళ్లగా దొంగలు తాళం పగులగొట్టి రెండున్నర తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. కాగా ఆ దంపతులు గురువారం టౌన్ పోలీస్‌స్టేçÙన్లో ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. -
మత్తిచ్చి.. నిలువు దోపిడీ
డీఎంయూ రైలులో ఏడు తులాల బంగారు ఆభరణాల అపహరణ బొబ్బిలి : విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న డీఎంయూ రైలులో ప్రయాణికులు కిక్కిరిసి ఉన్నా దంపతులకు మత్తు మందు ఇచ్చి నిలువు దోపిడీ చేశారు కొందరు దుండగులు. ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన దంపతులు తెలివి తెచ్చుకుని బొబ్బిలిలో ఉండే బంధువుల కు సమాచారం అందించడంతో వారికి బొబ్బిలి ప్రభు త్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి అనంతరం విశాఖ పంపించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నంలోని మల్కాపురంలో నివాసముంటున్న గండి భాస్కరరావు స్టీల్ ప్లాంటులో ఫోర్‌మన్‌గా పనిచేస్తున్నారు. పార్వతీపురంలో దగ్గర బందువుల అమ్మాయి వివాహ నిశ్చితార్థం కార్యక్రమంలో పాల్గొనడానికి శుక్రవారం ఉదయం భార్య వసంతతో పాటు విశాఖలో డీఎంయూ రైలు ఎక్కారు. టీ తాగడానికి కిందకు దిగడానికి ప్రయత్నిస్తుండగా, ఎదురుగా కూర్చున్న యువకులు మీరు ఎందుకు వెళ్ల డం మేమే తెస్తామంటూ రెండు కాఫీలను తీసుకువచ్చారు. కాఫీలు తాగిన వెంటనే దంపతులిద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో భార్య వసంత వద్ద ఉన్న నెక్లెస్, చైన్, పుస్తెలతాడు, గాజులు, భాస్కరరావు వద్ద ఉండే బ్రాస్లెట్, గొలుసు, ఉంగరం వంటివి దుండగులు తెంచుకుని పారిపోయారు. డీఎంయు రైలు ప్రతి కంపార్టుమెంటులో ప్రయణికు లు పుష్కలంగా ఉన్నప్పటికీ నిలువుదోపిడీ ఎంత చాకచక్యంగా జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు.. విజయనగరం దాటిన తరువాత వీరిద్దరూ అపస్మారక స్థితిలో ఉండడం, వారి దగ్గర ఆభరణాలు ఏవీ లేకపోవడాన్ని తోటి ప్రయాణికులు గమనించి వారికి సపర్యలు చేశారు. దాంతో వారికి కొద్దిగా తెలివి రావడంతో అసలు విషయం గుర్తించారు. కాఫీ తాగిన తరువాత మత్తులోకి వెళ్లిపోవడాన్ని తెలుసుకొని జరిగి న మోసాన్ని, బం గారు ఆభరణాలు పోవడాన్ని గుర్తిం చారు. ఇదే రైలులో బొబ్బిలి నుంచి ప్రయాణించడానికి వసంత చెల్లెలు నాగమణి, మిగిలిన బంధువులంతా సిద్ధమవుతుండగా గజపతినగరం వద్దకు వచ్చేసరికి వారికి ఫోన్లో బాధితులు సమాచా రం అందించారు. దాంతో బొబ్బిలిలో ఉండే బంధువులంతా రైల్వే స్టేషనుకు వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న దంపతులను అక్కడ దించేసి 108లో ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వారికి వైద్య సహాయం అందించినా, అపస్మారక స్థితి నుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో వెంటనే విశాఖ తరలించారు. అటు రైల్వే పోలీసులతో పాటు స్థానిక పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దాదాపు ఏడు తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు బాధితులు వాపోతున్నారు.