స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను చూపుతున్న పోలీసులు
గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): విజయవాడ గవర్నర్‌పేట జైహింద్ కాంప్లెక్స్‌లోని రాహుల్ జ్యూయలరీ దుకాణంలో బంగారు ఆభరణాలు దొంగిలించిన వ్యక్తిని విజయవాడ పోలీసులు 48 గంటల్లోనే పట్టుకున్నారు. అతని వద్ద సుమారు రూ.5 కోట్ల విలువ చేసే 10 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొబ్బిలి వెంకట హర్ష విజయవాడ జైహింద్ కాంప్లెక్స్‌లోని మహావీర్ జైన్‌కు చెందిన రాహుల్ జ్యూయలరీ దుకాణంలో గత సంవత్సరం పనిలో చేరాడు.
ఈ క్రమంలో ఏప్రిల్ 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో యజమాని మహావీర్ ఆస్పత్రి పనిమీద వెళ్లారు. ఇదే అదనుగా భావించిన హర్ష 5వ అంతస్తులోని యజమాని ప్లాటుకు వెళ్లి షాపులోకి బంగారు ఆభరణాలు కావాలని తీసుకొచ్చాడు. రెండు బ్యాగులలో సుమారు 10 కేజీల బంగారు ఆభరణాలు, షాపులో ఉన్న ఐడీబీఐ బ్యాంకుకు చెందిన యజమాని ఖాళీ చెక్‌తో హర్ష ఉడాయించాడు. 28వ తేదీన తాను దొంగిలించిన బ్యాంకు చెక్‌పై యజమాని సంతకం ఫోర్జరీ చేసి తన అకౌంట్‌లోకి రూ. 4.60లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేసి.. మధ్యాహ్నం పోరంకిలోని ఐసీఐసీఐ బ్యాంకులో డబ్బులు డ్రా చేశాడు. బంగారు ఆభరణాలు, డబ్బుతో పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అతనిని శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment