బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరిస్తున్న ఎస్‌ఐ రమేష్‌బాబు
ఆదోని టౌన్: కర్నూలు మండలం గార్గేయపురంలో జనవరి 4వ తేదీ రాత్రి దొంగలు ఒకే ప్రాంతంలోని ఆరు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. అన్నీ తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేశారు. తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి ప్రవేశించి.. రూ.3.55 లక్షల నగదు, 10 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. తాజాగా ఆదోని పట్టణంలోనూ అచ్చం అలాగే చోరీలకు పాల్పడ్డారు. శనివారం రాత్రి ఆరు ఇళ్ల తాళాలు పగులగొట్టి.. రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. రెండు చోట్లా శనివారం రాత్రే చోరీలు జరగడం, అది కూడా వరుస ఇళ్లలో ఒకే తరహాలో చోరీలకు పాల్పడడం యాదృచ్ఛికమా లేక ఒకే ముఠా పనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆదోని పట్టణంలోని పంజ్రాపోల్ వీధిలో శనివారం రాత్రి ఒకే ప్రాంతంలోని ఆరు ఇళ్లలో చోరీ జరిగింది. మెడికల్ రెప్రజెంటేటివ్‌లుగా పనిచేస్తున్న మంజునాథ్, సంపత్‌కుమార్, శివకుమార్ పక్కపక్క ఇళ్లలో ఉంటున్నారు. శనివారం రాత్రి ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. అదే వరుసలోని వేర్వేరు ఇళ్లలో ఉంటున్న దినసరి కూలీలు వీరేష్, రాఘవేంద్ర కూడా బంధువుల ఊళ్లకు వెళ్లారు. దొంగలు ఈ ఐదు ఇళ్ల తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. వస్తువులన్నీ చెల్లాచెదురు చేశారు. పెద్దగా ఏమీ దొరకలేదు.
చిన్నచిన్న వస్తువులను ఎత్తుకెళ్లారు. తర్వాత పక్క సందులోని రేష్మా, వినోద్ దంపతుల ఇంట్లో చోరీకి తెగబడ్డారు. రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించే రేష్మా, వినోద్ శనివారం అనంతపురం జిల్లా గుత్తిలో ప్రార్థనలకు వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా చోరీ విషయం వెలుగు చూసింది. తాళం తెగ్గొట్టి, బీరువాను పెకలించి నగదు, ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్ ఎస్‌ఐ రమేష్ బాబు తన సిబ్బందితో కలిసి చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. చుట్టుపక్కల వారిని విచారించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment