
చెల్లాచెదురుగా వస్తువులు
చెన్నై, వేలూరు: వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే పెళ్లి కుమార్తె ఇంట్లో నగలు, బంగారం చోరీ జరిగిన ఘటన వాలాజలో సంచలనం రేపింది. వివరాలు.. వేలూరు జిల్లా వాలాజలోని గ్రామమణి వీధికి చెందిన షణ్ముగం బీడీ మండీ యజమాని. ఇతని పెద్ద కుమార్తె పవిత్రకు ఆరణిలో ఆదివారం ఉదయం వివాహం జరిగింది. ఇందుకోసం పెళ్లి కుమార్తెతో పాటు తల్లిదండ్రులు, బంధువులు ఇంటికి తాళం వేసుకుని శనివారం సాయంత్రం ఆరణికి వెళ్లారు. వివాహం ఆదివారం ఉదయం ముగియడంతో పెళ్లి కుమార్తె, బంధువులతో కలిసి షణ్ముగం ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వాలాజలోని ఇంటికి వచ్చారు. ఇంటిలో మిరప పొడి చల్లి ఉండటాన్ని గమనించి లోనికి వెళ్లి చూశారు. వెనుక తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించారు. ఇంటిలోని వస్తువులు చెల్లా చెదరుగా పడి ఉండడంతో బీరువాను పరిశీలించారు. అందులో ఉంచిన 30 సవరాల బంగారం, రూ. 1.50 లక్షల నగదు చోరీ జరిగినట్లు తెలిసింది. ఈ విషయంపై వాలాజ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment