రిజర్వేషన్ కోసం ఆత్మహత్యాయత్నం
– కలెక్టరేట్ ఎదుట కిరోసిన్ పోసుకున్న ఇద్దరు యువకులు
– అడ్డుకున్న పోలీసులు
- తీవ్ర ఉద్రిక్తతల మధ్య వీఆర్‌పీఎస్ నేతల అరెస్టు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చకుండా సీఎం చంద్రబాబు మూడేళ్ల నుంచి తమ జాతిని అవమానపరుస్తున్నారనే ఆవేదనతో ఇద్దరు వీఆర్‌పీఎస్ కార్యకర్తలు కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యకు ప్రయత్నించారు. వివరాలిలా ఉన్నాయి.. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట భారీ ఎత్తున ధర్నా చేశారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, వాల్మీకి ఫెడరేషన్‌కు రూ.1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ధర్నాలో వీఆర్‌పీఎస్ నాయకులు మాట్లాడుతుండగా పెద్దపాడుకు చెందిన మహేష్, కర్నూలుకు చెందిన బోయ మధు ఒక్కసారిగా ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకునేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకుని పక్కకు తీసుకెళ్లారు. ఇద్దరు యువకుల ఆత్మహత్యాయత్నంతో వీఆర్‌పీఎస్ నాయకులు ఆగ్రహించారు. కలెక్టరేట్ గేటును తోసుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డువచ్చిన పోలీసులను సైతం తోసేసి వెళ్లారు. వెంటనే తేరుకున్న పోలీసులు ప్రధాన ద్వారంలోకి వెళ్తున్న వీఆర్‌పీఎస్ నాయకులను అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు, వీఆర్‌పీఎస్ నాయకుల మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తోపులాటలో సుభాష్ చంద్రబోస్ సహా 20 మంది కార్యకర్తల చొక్కాలు చిరిగి స్వల్ప గాయాలయ్యాయి. చివరకు పోలీసులు వారిని అరెస్టు చేసి త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా వీఆర్‌పీఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకోకపోతే జైలుకు వెళ్లేందుకైనా వెనుకాడమని సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. చివరకు సొంతపూచికత్తుపై వారిని విడుదల చేశారు.
మా జాతిని సీఎం మోసం చేస్తున్నారు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో తమ జాతి ఓట్లను వేయించుకొని ఎస్టీ రిజర్వేషన్‌ను కల్పిస్తామని హామీ ఇచ్చారు. మూడేళ్లు గడిచినా పట్టించుకోకపోవడంతో ఆవేదన కలిగింది. మా జాతికి సీఎం అన్యాయం, మోసం చేస్తున్నారనే బాధతో మా ప్రాణాలు అర్పించి సాధించుకోవాలని చూస్తే పోలీసులు అడ్డుకున్నారు. వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్ కోసం ప్రాణాలైనా అర్పిస్తాం. ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి వెంటనే అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలి. – పెద్దపాడు మహేష్, మధు