కుటుంబ కలహాలతో ఆత్మాహత్యాయత్నం
–తండ్రి పరిస్థితి విషమం
–అయిదేళ్ల కుమార్తె వైద్యసేవలు పొందుతూ మృతి
సీతానగరం (రాజానగరం): తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో ఆదివారం రాత్రి కుటుంబ కలహాలతో తండ్రి ఆత్మహత్యాయత్నంలో తన కుమార్తె అయిదేళ్ల పాప మృతి చెందగా, తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం రాత్రి కాండ్రు నరేష్ (38) తన అయిదేళ్ల పాప తరుణిపై పెట్రోల్ పోసి, తనపై కూడా పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధతో పెద్ద పెద్ద కేకలు వేస్తూ వీధిలో పరుగులు తీయడంతో స్థానికులు పెద్దసంఖ్యలో చేరుకుని మంటలు ఆర్పి రాజమహేంద్రవరం ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. పాప తరుణి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందింది. నరేష్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. వివరాల్లోకి వెళితే...నరేష్ హైదరాబాద్‌లో ప్రవేట్ ఉద్యోగం చేస్తుండగా తండ్రి కాండ్రు వీరన్న, తల్లి ప్రభావతి ఒత్తిడి మేరకు స్వగ్రామం తిరిగి వచ్చాడు. రాజమహేంద్రవరంలో రెడీమేడ్ వస్త్ర దుకాణం పెట్టి నష్టాలుపాలయ్యాడు. దీంతో ఆర్థిక సంబంధ విషయాలపై తల్లిదండ్రులతో విభేదాలు ఏర్పడడంతో ఆదివారం రాత్రి పక్కవీధిలో తన అక్క ఇంటి వద్ద ఉన్న కుమార్తెను బైక్‌పై తీసుకొని వచ్చాడు. బైక్ ట్యాంకుపైన కుమార్తెను కూర్చోబెట్టి పెట్రోల్ ట్యాంక్ మూతను తెరచి, తన వెంట తెచ్చుకున్న సీసాలోని పెట్రోల్‌ను తన కుమార్తెపై, తనపై పోసుకొని నిప్పు పెట్టుకున్నాడు. ఈ మంటల్లో ఆర్తనాదాలు చేస్తూ కాలిపోతుండగా నరేష్ భార్య విశాలాక్షిణి పరుగున వచ్చి దుప్పటి కప్పి మంటలు ఆర్పే ప్రయత్నం చేసింది. ఇంతలో బైక్‌పై ఉన్న తన కుమార్తె ఉందని గమనించి విశాలాక్షిణి వేసిన కేకలకు
స్థానికులు తరలివచ్చి కాపాడే ప్రయత్నం చేశారు. నరేష్ తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రయివేట్ ఆసుపత్రికి తరలించగా చిన్నారి మృతి చెందింది. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. కోరుకొండ సీఐ మధుసూదనరావు సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. ఎస్సై ఏ వెంకటేశ్వరావు కేసు నమోదు చేసి, అయిదేళ్ల పాప తరుణి మృతదేహాన్ని పోస్ట్‌మార్ట్‌మ్‌కు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.